ఏడు పదుల వయసులో పండంటి బిడ్డకు జన్మనిచ్చి అరుదైన ఘనత సాధించింది ఓ మహిళ. పెళ్లయిన 45 ఏళ్లకు మాతృత్వం అస్వాదిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వయస్సులో తల్లి అయిన అతికొద్ది మంది మహిళల్లో ఒకరిగా నిలిచింది.
గుజరాత్‌లోని మోరా గ్రామానికి చెందిన ఈ మహిళ పేరు జివున్‌బెన్ రబరి(70). ఆమె భర్త పేరు మల్ధారి(75). ఇద్దరూ దశాబ్దాలుగా పిల్లల కోసం పరితపిస్తున్నారు. కానీ వారి కల నెరవేరలేదు. చివరకు ఐవీఎఫ్ పద్ధతిలో బిడ్డకు జన్మనిచ్చినట్లు రబరి తెలిపారు. తాను 70 ఏళ్ల వయస్కురాలినని, కానీ దాన్ని నిరూపించేందుకు తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఆమె చెప్పారు. బ్రిటన్‌కు చెందిన డైలీ మెయిల్ ఈమేరకు కథనం ప్రచురించింది.
ఈ జంట తల్లిదండ్రులు కావడంపై వైద్యుడు నరేశ్ భానుశాలి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది అత్యంత అరుదుగా జరుగుతుందని తెలిపారు.
" వాళ్లు తొలిసారి మా వద్దకు వచ్చినప్పుడు ఈ వయసులో పిల్లల్ని కనడం సాధ్య కాదని చెప్పాము. కానీ వారు వినిపించుకోలేదు. వాళ్ల కుటుంబంలో చాలా మంది లేటు వయసులోనే తల్లిదండ్రులు అయినట్లు చెప్పారు. నేను చూసిన వాటిలో ఇది అత్యంత అరుదైన ఘటన"
-డా. నరేశ్ భానుశాలి
సాధారణంగా 70 ఏళ్ల మహిళ గర్భం దాల్చడం సాధ్యం కాదు. 48 ఏళ్లు దాటాక వారు మెనోపాజ్ దశకు చేరుకుంటారు. అయితే 'అమెరికన్ సొసైటీ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్' మాత్రం లేటు వయసులోనూ మహిళలు తల్లి కావచ్చని చెబుతోంది. కానీ వారికి సాధారణ గర్భాశయం ఉంటేనే వైద్యసాయంతో ఇది సాధ్యమవుతుందని తెలిపింది.
ఐవీఎఫ్ పద్దతిలో యువ వయస్సు మహిళ దానం చేసిన అండాలను, పురుషుడి వీర్యాన్ని శరీరం బయట ఫలదీకరణం చేస్తారు. అనంతరం పిండాన్ని తల్లి కావాలనుకునే మహిళ గర్భాశయంలోకి పంపుతారు.
2019 సెప్టెంబర్ 5న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంగాయమ్మ కూడా 73 ఏళ్ల వయసులో ఐఫీఎప్ పద్ధతిలో కవలలకు జన్మనిచ్చారు. ఇది వైద్యశాస్త్రంలో అద్భుతమని అప్పుడు వైద్యులు అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద వయస్సులో తల్లి అయిన మహిళ కూడా ఈమే అని ప్రచారం జరిగింది. మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చిన వార్తకు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అయితే గిన్నిస్ బుక్‌లో అధికారికంగా వీరి పేర్లు నమోదు కాలేదు. స్పెయిన్‌కు చెందిన మారియా డెల్ కార్మెన్ బౌసదా డి లారా పేరుతోనే ఈ రికార్డు ఉంది. 2006లో 66ఏళ్ల 358రోజుల వయస్సులో ఆమె మగ కవలలకు జన్మనిచ్చారు.
ఇదీ చదవండి: Azadi Ka Amrit Mahotsav: బ్రిటిషర్లకు లొంగని బానిస రాణి.. హజ్రత్ మహల్!