ముంబయి సెంట్రల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం అధునాతన 'పాడ్ హోటల్'ను అందుబాటులోకి తీసుకొచ్చింది భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ). స్టేషన్ మొదటి అంతస్తులోని రెండు నాన్ ఏసీ గదులను జపాన్ తరహా క్యాప్సుల్ హోటల్‌గా మార్చింది. అందులో ప్రయాణికులకు రాత్రివేళ బస కల్పించడానికి అనువుగా మొత్తం 30 గదులుంటాయని అధికారులు తెలిపారు. ఈ హోటల్లో ఉండాలంటే 12 గంటలకు రూ. 999, 24 గంటలకు రూ. 1,999 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఉచిత వైఫై, టీవీ, చిన్న లాకర్, అద్దం, రీడింగ్ లైట్లు లాంటి వసతులు ఉన్నాయి.
ప్రైవేటు హోటళ్ల కన్నా చౌకగా, తగిన వసతులతో రాత్రి వేళ పూర్తి భద్రత కల్పించే విధంగా వీటిని రూపొందించినట్లు ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు. ఈ హోటల్ ఏర్పాటు కోసం సుమారు రూ.1.80కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు.
వాస్తవానికి 2020లోనే ఈ పాడ్ హోటల్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆ పనులకు అంతరాయం ఏర్పడిందని అధికారులు చెప్పారు.
ఇదీ చూడండి: పెళ్లికాని ప్రసాదుల్లా 40వేల మంది- 'వధువు' కోసం ఆ రాష్ట్రాల్లో వేట