ప్రభుత్వ రంగ గ్యాస్ రిటైల్ సంస్థలకు కేంద్రం భారీ సాయం ప్రకటించింది. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్‌ను తక్కువ ధరలకు విక్రయించడం ద్వారా నష్టపోయిన మూడు సంస్థలను ఆదుకునేందుకు ఆర్థిక ప్యాకేజీ అందించనున్నట్లు తెలిపింది. వన్-టైమ్ గ్రాంటు కింద రూ.22 వేల కోట్ల సాయం చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థలు ఈ గ్రాంటు అందుకోనున్నాయి.
'2020 జూన్ నుంచి 2022 జూన్ మధ్య ఈ సంస్థలు అసలు ధరకన్నా తక్కువకే సిలిండర్లను విక్రయించాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వినియోగదారులకు సరఫరా చేశాయి. ఈ సమయంలో అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు 300 శాతం పెరిగాయి. కానీ, దేశీయంగా మాత్రం ఈ సమయంలో 72 శాతం మాత్రమే ఎల్పీజీ ధరలు పెరిగాయి. వినియోగదారులపై భారం పడకుండా.. అధిక ధరలను వారికి బదిలీ చేయలేదు. నష్టాలు వచ్చినా.. మూడు సంస్థలు వినియోగదారులకు వంట గ్యాస్‌ను నిరంతరం సరఫరా చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రూ.22వేల కోట్ల గ్రాంటు అందించాలని నిర్ణయించాం' అని ప్రభుత్వ ప్రకటన వివరించింది.
రైల్వే ఉద్యోగులకు కేంద్రం పండగ బోనస్..రూ.1,832 కోట్లు
కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుకగా.. 78 రోజుల బోనస్ ప్రకటించింది. 11.27లక్షల రైల్వే ఉద్యోగులకు రూ.1,832 కోట్ల బోనస్ ఇవ్వడానికి నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఒక్కో ఉద్యోగికి 78 రోజుల బోనస్ గరిష్ఠంగా రూ.17,951 అందనుంది. మరోవైపు ఈశాన్య ప్రాంత అభివృద్ధి కోసం కొత్త పథకానికి, మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీల సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
గుజరాత్‌లోని ప్రభుత్వ-ప్రైవేట్ ఆధీనంలో ఉన్న దీన్‌దయాల్ పోర్టులో కంటైనర్ టెర్మినల్ డెవలప్మెంట్ కోసం.. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 4,539 కోట్ల రూపాయలతో.. దీన్‌దయాల్ పోర్టులో కంటైనర్ టెర్మినల్ అభివృద్ధి చేయనున్నారు.
ఇవీ చదవండి: 'ఆమె' పేరుతో ప్రభుత్వం రోడ్డు నిర్మాణం.. పొట్టకూటి కోసం తల్లిదండ్రులే కూలీలుగా మారి..
నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. కేంద్రం, ఆర్బీఐలకు నోటీసులు