మూడు యుద్ధాల్లో దేశం తరఫున పోరాడిన ఓ జవాను 81 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా పొందారు. హరియాణాకు చెందిన ఆ వృద్ధుడు ఇగ్నో నుంచి బీఏ డిగ్రీ పట్టా పొందారు. ఆదివారం జరిగిన ఇగ్నో 36వ స్నాతకోత్సవ కార్యక్రామానికి వచ్చి తన పట్టాను స్వీకరించారు. ఆయనే లాల్ సింగ్ గోద్రా. లాల్ సింగ్ సిర్సా ప్రాంతానికి చెందిన ఆయన.. భారత అర్మీలో సైనికుడిగా చేసి పదవి విరమణ చేశారు. ఆయన 1962, 1965, 1971 యుద్ధాల్లోనూ పాల్లొన్నారు. పదవి విరమణ తరువాత హరియాణా రవాణా శాఖలో పనిచేశారు. అందులో నుంచి కూడా రిటైరైన తరువాత.. కొద్ది రోజులు ఇంటి వద్దే విశ్రాంతి తీసుకున్నారు.
విద్యార్హతలు తక్కువగా ఉండటం వల్ల గతంలో అనేక ఇబ్బందులు పడ్డట్లు తెలిపారు లాల్ సింగ్. మనవళ్లు, మనవరాళ్లను చూసి తాను కూడా చదువుకోవాలని నిర్ణయించుకున్నారు. అనంతరం ఇగ్నోలో చేరారు. లాల్ సింగ్ 10, 12వ తరగతులు ఇగ్నోలోనే పూర్తిచేశారు. అనంతరం బీఏ డిగ్రీలో చేరారు. లాల్ సింగ్ పట్టా పొందుతుండగా మిగతా విద్యార్థులు చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు.
సన్మానం
మూడు యుద్ధాల్లో పాల్గొన్న ఆయన.. ఇప్పటికీ నేర్చుకోవడానికి వెనకాడటం లేదు. ప్రస్తుతం బీఏ పట్టా తీసుకున్న ఆయన.. భవిష్యత్‌లో ఎంఏ పూర్తి చేసి పీహెచ్డీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈయన పట్టుదలను చూసి స్నాతకోత్సవానికి వచ్చినవారంతా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇగ్నో అధికారులు కూడా లాల్‌సింగ్ సన్మానించారు. లాల్ సింగ్ మనవరాళ్లిద్దరు ఎంబీబీఎస్ చదువుతున్నారు.
ముర్ము సమక్షంలో...
ఓపెన్ యూనివర్సిటీగా అందరికీ సుపరిచితమైన ఇగ్నో.. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. 36వ స్నాతకోత్సవంలో భాగంగా 300 మందికి పైగా విద్యార్థులు యూనివర్సిటీ నుంచి పట్టాలు స్వీకరించారు. విద్యార్థుల వయసు 18 నుంచి 81 ఏళ్ల మధ్య ఉందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. హరియాణా విద్యా బోర్డు సెక్రెటరీ రాజేశ్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పట్టాలు అందించారు. విద్యార్థుల ఎన్రోల్మెంట్ శాతాన్ని 50 శాతానికి చేర్చడమే తమ లక్ష్యమని రాజేశ్ గోయల్ చెబుతున్నారు. నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
"దేశంలో ఉన్నత విద్య ఎన్రోల్మెంట్ శాతాన్ని 50కి చేర్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించారు. ఇది ఇప్పుడు 27 శాతంగా ఉంది. ఈ లక్ష్య సాధనలో ఇగ్నో కీలక పాత్ర పోషిస్తుంది. 2025 నాటికి నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని హరియాణా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ఇందుకోసం ప్రభుత్వం పూర్తిగా సిద్ధమవుతోంది. విద్యా శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అంతర్జాతీయ యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకుంటున్నాం."
-రాజేశ్ గోయల్, హరియాణా విద్యా బోర్డు కార్యదర్శి
దేశవ్యాప్తంగా 36 కేంద్రాలలో ఇగ్నో స్నాతకోత్సవం జరిగిందని కర్నాల్ ప్రాంతీయ ఇంఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ ధరమ్‌పాల్ వెల్లడించారు. మొత్తంగా 2 లక్షల 79 వేల మంది విద్యార్థులకు డిగ్రీలు అందించినట్లు తెలిపారు. కర్నాల్ ప్రాంతీయ కేంద్రంలో 16వేల మంది పట్టాలు పొందారని వివరించారు. ఇగ్నో కర్నాల్ కేంద్రంలో ఎన్రోల్మెంట్లు త్వరలోనే రెండు లక్షలు దాటే అవకాశం ఉందని ధరమ్‌పాల్ స్పష్టం చేశారు.