Indian army new rules 2022 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలకు అనుగుణంగా భారత సైన్యంలో సమూల మార్పులు చేసేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రారంభమైంది. యూనిఫామ్‌లు, యూనిట్‌లు సహా రెజిమెంట్లు.. వలసవాద పద్ధతులు, బ్రిటిష్ పేర్లను మార్చేందుకు భారత సైన్యం సమాయత్తమైంది. సిక్కు, గోర్ఖా, జాట్, రాజ్‌పుత్ వంటి సైనిక యూనిట్ల పేర్లు కూడా మార్చాలని ఆర్మీ యోచిస్తోంది. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలు, ఆచారాలు, నిబంధనలు, చట్టాలు, నియమాలు, విధానాలు, ఆంగ్ల పేర్లను సమీక్షించి అవసరమైన వాటికి మార్పులు చేయాలని ఆర్మీ నిర్ణయించింది. వారసత్వ సైనిక అభ్యాసాలు, విన్యాసాలపైనా నిర్ణయం తీసుకోనున్నారు. కట్టడాలు, భవనాలు, సంస్థలు, రోడ్లు, ఉద్యానవనాలకు పెట్టిన బ్రిటిష్ కమాండర్ల పేర్లను కూడా తొలగించాలని ఇండియన్ ఆర్మీ నిర్ణయించింది.
Indian army British traditions : బ్రిటిష్ వలస వారసత్వానికి దూరంగా జరగాలన్న ప్రధాని మోదీ ఆదేశాలతో చర్యలు ప్రారంభమయ్యాయని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ అధికారి ఒకరు తెలిపారు. ప్రాచీనమైన, అసమర్థమైన పద్ధతులకు దూరంగా ఉండటం చాలా అవసరమని.. భారత సైన్యం కూడా జాతీయ భావాలకు అనుగుణంగా వారసత్వ పద్ధతులను సమీక్షించాల్సిన అవసరం ఉందని ఆ అధికారి స్పష్టం చేశారు. భారతీయులను అణిచేసేందుకు బ్రిటిష్ పాలకులు ప్రధానం చేసిన యుద్ధ గౌరవాలు, స్వాతంత్ర్యానికి పూర్వం ఇచ్చిన బిరుదులను కూడా సమీక్షించనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే బీటింగ్ రిట్రీట్ లాంటి కార్యక్రమాలను కూడా మార్చే అవకాశం ఉంది. వీటితో పాటు బ్రిటిష్ కాలం నాటి చిహ్నాలు, అధికారుల మెస్ విధానాలు, సంప్రదాయాలు, ఆచారాలను కూడా సమీక్షిస్తారు.
Indian army day parade : ఇక నుంచి ఆర్మీ డే పరేడ్‌ను దేశ రాజధానిలో కాకుండా సదరన్ కమాండ్ ఏరియాలో ప్రతి ఏడాది జనవరి 15న నిర్వహించాలన్న ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. 1949 జనవరి 15న ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప భారత సైన్యం మొదటి భారతీయ కమాండర్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన గుర్తుగా.. ఏటా ఆర్మీ డే జరుపుతారు. ఈ ఆర్మీ డేను సంప్రదాయంగా దిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తారు. కానీ వచ్చే ఏడాది ఆర్మీ డే పరేడ్ దిల్లీ బయట నిర్వహిస్తారని, ఈ పరేడ్ సదరన్ కమాండ్ పరిధిలో ఉంటుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది నుంచి రొటేషన్ పద్ధతిలో ఏటా.. వివిధ ప్రాంతాల్లో ఆర్మీ డే పరేడ్ నిర్వహించాలని కూడా భారత సైన్యం భావిస్తోంది. దీనికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగీకారం తెలపాల్సి ఉంది.