భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యం అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తోంది. శత్రు దేశంలోని కీలక ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లే సామర్థ్యంతో రూపొందించిన పినాక, స్మెర్చ్ రాకెట్ వ్యవస్థలను చైనా సరిహద్దుల వద్ద మోహరించింది.
![Indian Army displays Pinaka & Smerch multiple rocket launcher systems](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13428210_img2.jpg)
అత్యంత శక్తిమంతమైన ఈ రెండు రాకెట్ వ్యవస్థలను ప్రస్తుతం అసోంలోని ఈస్ట్రన్ సెక్టార్లో పలు చోట్ల ఏర్పాటుచేసింది. పినాక రాకెట్ వ్యవస్థ కేవలం 44 సెకన్లలో 75 రాకెట్లను పేల్చడం ద్వారా వెయ్యి మీటర్ల పొడవు, 800 మీటర్ల వెడల్పు గల ప్రాంతాన్ని భస్మీ పటలం చేయగలదు. పినాకలో.. మైదాన ప్రాంతంలో ఉన్న లక్ష్యం కోసం ఒక రాకెట్‌ను, కొండలు, ఇతర క్లిష్ట ప్రాంతాల్లో ఉన్న లక్ష్యాన్ని ఛేదించేందుకు మరో తరహా రాకెట్‌ను మార్చుకోగల ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఈ రెండు రాకెట్లను ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేస్తే ఎక్కువ దూరంలోని లక్ష్యాల్ని ఛేదించే అవకాశం ఉంటుందని సైనికాధికారులు తెలిపారు. 75 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించేలా అభివృద్ధి చేసిన పినాక రాకెట్ వ్యవస్థ త్వరలో సైన్యంలో చేరనున్నట్లు వెల్లడించారు.
![Indian Army displays Pinaka & Smerch multiple rocket launcher systems](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13428210_img.jpg)
మరో రాకెట్ వ్యవస్థ స్మెర్చ్ 90 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం కలిగిఉంది. 40 సెకన్లలో 44 రాకెట్లను పేల్చగల సామర్థ్యంతో స్మెర్చ్ రాకెట్ వ్యవస్థను రూపొందించారు. స్మెర్చ్ 1200 చదరపు మీటర్ల ప్రాంతాన్ని ధ్వంసం చేయగలదు. భారత సైన్యంలో అత్యధికంగా 90 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉన్న రాకెట్.. స్మెర్చ్ ఒక్కటే. ఈ రాకెట్ వ్యవస్థను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం భారత సైన్యంలో 3 స్మెర్చ్ రెజిమెంట్లు ఉన్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీఓ రూపొందించిన పినాక రాకెట్‌కు సంబంధించి ప్రస్తుతం 4 రెజిమెంట్లు ఉన్నాయి. మరో ఆరు రెజిమెంట్లను సైన్యం సిద్ధం చేస్తోంది.
![Indian Army displays Pinaka & Smerch multiple rocket launcher systems](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13428210_img3.jpg)
పినాక, స్మెర్చ్ రాకెట్ వ్యవస్థలు అతి తక్కువ సమయంలో వేగంగా స్పందించే సత్తా కలిగి ఉన్నాయి. లక్ష్యాన్ని ఛేదించడంలోనూ అత్యంత కచ్చితత్వంతో పనిచేయగలవు.
ఇదీ చదవండి: 'ఆపరేషన్ సర్ప్‌వినాశ్'ను తలపించేలా పూంచ్ ఎన్‌కౌంటర్!