భారత్ నుంచి అక్టోబర్ వరకు కొవాక్స్ ప్రాజెక్టు టీకాలు ఎగుమతి చేసే అవకాశం లేదు. దేశీయంగా కొవిడ్ తీవ్రత పెరిగిపోవడం దీనికి ప్రధాన కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత నెలలో దేశంలో కేసులు పెరగడం వల్ల టీకాల ఎగుమతులను నిలిపివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికే భారత్ 66 మిలియన్ల డోసుల టీకాలను ఎగుమతి చేసింది. దీంతో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక సహా పలు ఆఫ్రికా దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భారత్ బయట టీకాలను తయారు చేస్తున్న సంస్థలు కొవాక్స్ కార్యక్రమానికి సరఫరాలను పెంచాలని కోరింది.
దీనిపై ప్రభుత్వ వర్గాల్లోని కొందరు ఓ ఆంగ్ల వార్తా సంస్థ వద్ద పరిస్థితిని వెల్లడించారు. "అవసరం లేని దేశాలకు టీకాల్లో జాప్యం విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. మరికొన్ని దేశాలకు మాత్రం భారత్ పరిస్థితిని చూసి ఇప్పట్లో టీకాలు ఆశించవద్దని వెల్లడించాం" అని పేర్కొన్నారు. మరోపక్క టీకా ఎగుమతులపై విదేశాంగశాఖ కూడా గుంభనంగా ఉంది.
ఇక కొవాక్స్ కార్యక్రమంలో అత్యంత కీలకమైన గావి బృందం ప్రతినిధి మాట్లాడుతూ "భారత్ అత్యంత తీవ్రమైన సెకండ్‌వేవ్‌ను ఎదుర్కొంటోంది. దీంతో కొవాక్స్ కార్యక్రమానికి మే చివరి నాటికి ఇస్తామన్న 140 మిలియన్ల టీకాలను కూడా దేశీయంగానే వినియోగిస్తోంది. భారత్‌కు అవసరమైన పూర్తిస్థాయి మద్దతు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం" అని పేర్కొన్నారు.
పేద దేశాలకు టీకాలు అందించే కొవాక్స్ కార్యక్రమానికి 1.1 బిలియన్ డోసులు సరఫరా చేసేదుకు సీరం సంస్థ ఒప్పందం కుదుర్చుకొంది. వీటిల్లో ఆస్ట్రాజెనెకా, నోవావ్యాక్స్ టీకాలు ఉన్నాయి. సీరం ప్రతినిధి మాట్లడుతూ జూన్ నాటికి ఎగుమతులను పునరుద్ధరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న మోదీ