కరోనా వ్యాప్తిలో పొరుగుదేశాలకు భారత్ సహకారం కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా శ్రీలంకకు 5 లక్షల కొవిషీల్డ్ డోసులను నేడు పంపించనుంది. వీటిని బహుమతి రూపంలో అందిస్తున్నట్లు సమాచారం.
కరోనా పోరులో సాయం అందిస్తామని గతేడాది సెప్టెంబర్లో శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. వైద్య, ఆర్థిక వ్యవస్థపై పడే భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే టీకా సాయం చేస్తోంది భారత్.
ఇప్పటివరకు భూటాన్, మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, మారిషస్, సీషెల్స్ దేశాలకు ఉచితంగా టీకా అందించింది భారత్. బ్రెజిల్, మొరాకో దేశాలకు వాణిజ్య పద్ధతిలో 20 లక్షల డోసుల ఎగుమతిని ప్రారంభించింది. సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు త్వరలో వాణిజ్య పద్ధతిలో సరఫరా చేయనుంది.