దురాక్రమణ బుద్ధిగల చైనా ఎత్తుగడలకు విరుగుడుగా భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నదిపై 10 గిగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించే అంశాన్నికేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించిన దస్త్రం కేంద్ర ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారుల వద్దకు చేరిందన్న వార్తలు ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
టిబెట్ నుంచి ఉద్ధృతంగా ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై చైనా 60 గిగావాట్ల సామర్థ్యం గల జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మించేందుకు సిద్ధమైంది. భారత్‌కు ఎగువనున్న ప్రాంతంలో ప్రాజెక్ట్‌ను చేపట్టం ద్వారా దేశంలో నీటి కరవు లేదా అకాల వరదలు సంభవించే ప్రమాదముందని భారతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దిగువనున్న దేశాలకు ఎలాంటి ముప్పు కలగకుండా నిర్మిస్తామని డ్రాగన్ హామీ ఇస్తున్నప్పటికీ చైనాను నమ్మే పరిస్థితి లేదు. ఉద్దేశపూర్వకంగానే గిల్లికజ్జాలు పెట్టుకొనే దాని నైజమే ఇందుకు కారణం. అంతేకాకుండా గతంలో చైనా నిర్మించిన ఆనకట్టల వల్ల దిగువనున్న దేశాలు కరవు కోరల్లో చిక్కుకున్ని నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.
చైనాకు దీటుగా..
చైనా నిర్మిస్తున్న ఆనకట్టలు, ప్రాజెక్టుల వల్ల ముప్పును నివారించాలంటే అతి త్వరగా అరుణాచల్ ప్రదేశ్‌లో డ్యామ్ నిర్మించడం అవసరమని భారత్ భావిస్తోంది. ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ప్రాజెక్ట్ అంశంపై చర్చిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల భారత్‌కు ఎలాంటి ముప్పు లేదని చైనా చెబుతోంది. అయితే డ్రాగన్ తన మాటలకు ఎంతమేరకు కట్టుబడి ఉంటుందోన్న అనుమానం భారత్ వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ.. డ్యాం నిర్మాణ ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.
ఇప్పటికే లద్దాఖ్ ప్రాంతంలో భారత్-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో చైనాకు.. ఎదురునిలిచి ప్రాజెక్ట్ నిర్మిస్తే జల యుద్ధాలకు దారి తీసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: బ్రహ్మపుత్రపై చైనా డ్యాం- అలా చేస్తే భారత్‌కు లాభం!