భారత 72వ గణతంత్ర వేడుకలు దిల్లీలోని రాజ్‌పథ్‌లో ఘనంగా జరిగాయి. దేశ సైనిక శక్తి, సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా వేడుకలు నిర్వహించారు. వాయుసేన తొలిసారి రఫేల్ యుద్ధవిమానాన్ని గణతంత్ర పరేడ్‌లో ప్రదర్శించింది. గంటకు 900కిమీ వేగంతో నింగిలోకి దూసుకెళ్లిన ఈ యుద్ధవిమానం భారత వైమానిక సామర్థ్యాన్ని చాటిచెప్పింది. రఫేల్ ప్రదర్శనతోనే రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు ముగిశాయి.
సైనిక శక్తి..
వేడుకల్లో త్రివిధ దళాలు నిర్వహించిన పరేడ్ అబ్బురపరిచింది. పరేడ్‌లో తొలి ఆరు వరుసల్లో పదాతి దళం, తర్వాతి రెండు వరుసల్లో నావికాదళం, వాయుసేన వరుసగా కవాతు చేశాయి. పదాతిదళం తన ఆయుధ సంపత్తిని వేడుకల్లో సగర్వంగా ప్రదర్శించింది. రష్యన్ టీ-90 యుద్ధ ట్యాంకులు, టీ-72 బ్రిడ్జ్ లేయర్‌ట్యాంక్, బీఎంపీ-2 ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్, పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్, బ్రహ్మోస్ క్షిపణులు కవాతులో ఆకట్టుకున్నాయి.
కెప్టెన్ క్వామ్రుల్ జమాన్ నేతృత్వంలో 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ క్షిపణిని ప్రదర్శించారు.
140 ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్ కెప్టెన్ ప్రీతి చౌదరి.. షిల్కా వెపన్ సిస్టమ్‌కు నేతృత్వం వహించారు. గణతంత్ర వేడుకల్లో పదాతి దళం నుంచి పాల్గొన్న ఏకైక మహిళా కమాండర్‌గా ప్రీతి చౌదరి నిలిచారు.
బంగ్లా సైనికులు..
1971లో బంగ్లాదేశ్‌తో జరిగిన యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికులకు గౌరవంగా సైనిక కవాతుకు బంగ్లాదేశీ సాయుధ దళం నేతృత్వం వహించింది. లెఫ్టినెంట్ కర్నల్ అబూ మహ్మద్ షాహూర్ షవాన్ నేతృత్వంలో 122 మంది సభ్యుల బంగ్లా బృందం మొదటిసారి కవాతులో పాల్గొంది.
శకటాల ప్రదర్శన..
దేశ సాంస్కృతిక వారసత్వం, ఆర్థిక పురోగతిని ప్రతిబింబించేలా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ కేంద్ర శాఖలకు చెందిన 9 శకటాలను ప్రదర్శించడం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రక్షణ శాఖకు సంబంధించిన 6 శకటాలనూ ప్రదర్శించారు.
ఉత్తర్‌ప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలా అయోధ్య రామమందిర శకటం, లద్దాఖ్ సంస్కృతి, మతసామరస్యాన్ని చాటిచెప్పేలా రూపొందించిన శకటం, గుజరాత్ మోధెరా సూర్య దేవాలయ శకటం ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తరతరాలుగా అందిపుచ్చుకుంటున్న నైపుణ్యాలు, సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా పాఠశాల విద్యార్థులు జానపద, హస్త కళలను ప్రదర్శించారు. ఒడిశాలోని కలహండికి చెందిన బజసల్, జానపద నృత్యం, ఫిట్ ఇండియా ఉద్యమం, ఆత్మ నిర్భర్ భారత్ శకటాలనూ వేడుకల్లో ప్రదర్శించారు.
పరిమిత సంఖ్యలో వీక్షకులు..
కరోనా నేపథ్యంలో గణతంత్ర వేడుకలకు ఈసారి తక్కువ సంఖ్యలో వీక్షకులను అనుమతించారు. 15ఏళ్ల లోపు వారు, 65ఏళ్లు పైబడిన వారిని కార్యక్రమానికి దూరంగా ఉంచారు.
పరేడ్‌కు మార్పులు..
కరోనా దృష్ట్యా ఈసారి పరేడ్‌కు కీలక మార్పులు చేశారు. ఏటా 8.5 కిమీ నిర్వహించే పరేడ్‌ను 3.5కిలోమీటర్లకే కుదించారు. ఈసారి వేడుకలకు విదేశీ అతిథులెవరూ హాజరు కాలేదు. గత 55ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి.
ఇదీ చూడండి: ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తత- రైతులపై లాఠీఛార్జ్