ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు వివిధ దేశాలకు 2.29 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేసింది. వాటిలో 64 లక్షల డోసులను ఉచితంగా అందించగా.. 1.65 కోట్ల డోసులను వాణిజ్య రూపంలో అందించింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
దశల వారీగా వివిధ దేశాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేస్తామని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. రాబోయే వారాల్లో ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికా, కరీబియన్ కమ్యూనిటీకి టీకా సరఫరా చేయనున్నామని చెప్పారు. వ్యాక్సిన్ అవసరాలకు అనుగుణంగానే ఈ టీకాలను పంపిణీ చేస్తామని శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
మయన్మార్‌పై అంగీకారం..
సైనిక తిరుగుబాటుతో అల్లాడుతున్న మయన్మార్ పరిస్థితులపై చర్చించడానికి భారత్-అమెరికాలు అంగీకరించాయని అనురాగ్ శ్రీ వాస్తవ తెలిపారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో చర్చించారని వెల్లడించారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే పరిపాలన జరగాలని భారత్ విశ్వవిస్తున్నట్టు అన్నారు. అక్కడి పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తోందని చెప్పారు.
ఇదీ చదవండి:రైతుల ఆందోళనపై కెనడా ప్రధాని యూ టర్న్