తూర్పు లద్ధాఖ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణకు భారత్‌తో చైనా కలిసి పనిచేస్తుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ అభిప్రాయపడింది. సరిహద్దుల్లో శాంతిస్థాపనతో పాటు ప్రశాంత వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు చైనా తమతో కలిసి వస్తుందని విదేశీ వ్యవహారాల ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఆకాంక్షించారు.
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇది ఎంతగానో దోహదం చేయగలదని ఆయన పేర్కొన్నారు. భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను కొనసాగించే ఉద్దేశం ఇరుదేశాలకు లేదని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
పాంగ్యాంగ్ సరస్సు నుంచి బలగాలు ఉప సంహరించుకోవటాన్ని గొప్ప ముందడుగుగా పేర్కొన్న విదేశాంగ శాఖ అదే విధంగా ఇతర ప్రాంతాల్లోనూ ఉద్రిక్తతలు చల్లార్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇప్పటికే సమస్యల పరిష్కారానికి ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు గుర్తుచేసింది.
ఇదీ చూడండి: మయన్మార్లో హింసను ఖండించిన భారత్