కొవాక్స్ కార్యక్రమం ద్వారా భారత్‌కు త్వరలోనే 75 లక్షల మోడెర్నా టీకా డోసులు అందే అవకాశాలున్నాయి. మోడెర్నా, ఫైజర్ టీకాలను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు.. సంబంధిత కంపెనీలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు ఇటీవల నీతిఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. అయితే అమెరికాతో.. నష్టపరిహార నిబంధనపై ఏకాభిప్రాయం ఇంకా కుదరనందున మోడెర్నా వ్యాక్సిన్ దేశంలో ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
చర్చలు జరుగుతున్నాయ్..
కొవాక్స్ కార్యక్రమం ద్వారా 75 లక్షల మోడెర్నా డోసులు భారత్‌కు అందనున్నాయని డబ్ల్యూహెచ్ఓ సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్.పూనమ్ కేత్రపాల్ సింగ్ తెలిపారు. మోడెర్నా టీకాల దిగుమతికి ప్రభుత్వం చురుకుగా పని చేస్తోందని నీతిఆయోగ్‌ఆరోగ్య విభాగ ప్రతినిధి డాక్టర్ వీకే పాల్ తెలిపారు. దానిపై చర్చలు జరుగుతున్నట్లు వివరించారు.
నష్టపరిహార నిబంధన ఒప్పందాన్ని ఖరారు చేయడానికి భారత ప్రభుత్వం పలు షరతులను విధిస్తూ... పరిశీలన కోసం వాటిని ఇటీవలే అమెరికాకు చెందిన ఔషధ తయారీదారులకు పంపినట్లు సమాచారం.
భారత్‌లో మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి జూన్‌లోనే డీసీజీఐ అనుమతించింది. ఈ టీకాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు.. సిప్లా సంస్థకు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇదీ చదవండి : Vaccine Trials: 2-6ఏళ్ల వారికి రెండో డోసు ట్రయల్స్!