ప్రపంచ ఆకలి సూచిక(జీహెచ్‌ఐ)లో భారత్ స్థానాన్ని తగ్గించడంపై ప్రభుత్వం మండిపడింది. 2020లో వెలువరించిన సూచికలో 94వ స్థానంలో ఉన్న మనదేశం.. 2021లో 116 దేశాల జాబితాలో భారత్ 101వ స్థానానికి పరిమితమైంది. దీనిపై స్పందించిన కేంద్రం.. అశాస్త్రీయ పద్ధతుల ద్వారా లెక్కించిన ఈ సూచికను తప్పులతడకగా అభివర్ణించింది. ఈ మేరకు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. దేశంలో కోట్ల మంది ఆకలిని తీరుస్తూ.. పేదరికాన్ని తగ్గించడంలో భారత్ చేస్తున్న వాస్తవ ప్రయత్నాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.
ఆహార సూచికలో పొరుగున ఉన్న నేపాల్(76), బంగ్లాదేశ్(76), మయన్మార్(71), పాకిస్థాన్(92) కంటే భారత్ పరిస్థితి మరీ తీసికట్టుగా ఉందని విపక్షాలు మండిపడ్డాయి. ఈ దేశాలు కూడా ఆందోళన కలిగించే విభాగంలోనే ఉన్నప్పటికీ తమ దేశంలోని పౌరులకు ఆహారం అందించడంలో భారత్ కంటే మెరుగ్గా ఉండటం గమనార్హం. ఐర్లాండ్‌కు చెందిన Concern Worldwide, జర్మనీకి చెందిన Welt Hunger Hilfe సంయుక్తంగా ఈ ఆకలి సూచికకు సంబంధించిన నివేదికను తయారు చేశాయి. భారత్‌లో ఆహార స్థాయి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నాయి.
భారత్ జీహెచ్‌ఐ స్కోరు 2000లో 38.8 గా ఉండగా.. 2012-2021 మధ్యలో 28.8 నుంచి 27.5కి పడిపోయింది. పోషకాహార లేమి, చిన్నారుల్లో ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, ఐదేళ్ల లోపు పిల్లల్లో వారి వయసుకు తగ్గ బరువు లేకపోవడం, ఆ వయసు వారిలో మరణాలు.. ఈ సూచికల ఆధారంగా జీహెచ్‌ఐ స్కోరును గణిస్తారు. కొవిడ్-19, మహమ్మారి కారణంగా విధించిన ఆంక్షలు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇది చిన్నపిల్లల్లో పోషకాహార లేమికి దారితీసింది. ఆ విషయంలో భారత్ ముందు వరుసలో ఉందని పేర్కొంది. అయితే ఆ సూచికల్లో భారత్ కాస్త మెరుగవుతోందని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఆకలికి వ్యతిరేకంగా జరుపుతోన్న పోరాటం దారి తప్పిందని, 47 దేశాలు 2030నాటికి తక్కువ ఆకలి స్థాయుల్ని సాధించలేవని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నివేదికను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
- 'పేదరికం, ఆకలి, భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా, డిజిటల్ ఎకానమీగా మార్చడం.. వంటి వాటిని నిర్మూలించినందుకు మోదీకి అభినందనలు అని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. ప్రపంచ ఆకలి సూచికలో భారత్ 2020లో 94 వ స్థానంలో ఉంది. 2021లో అది 101వ స్థానానికి పడిపోయింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, నేపాల్ కంటే భారత్ వెనుకబడి ఉంది' వ్యంగ్యంగా రాసుకొచ్చారు.
- ఆకలిపై పోరులో భాగంగా యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఆహార హక్కు' చట్టం దుర్వినియోగం అవుతోందని మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. "భారత ప్రభుత్వం తన వైఫల్యాలను సరిదిద్దుకోవాలిన్నారు."
- "భారత్ సోమాలియా లాంటి దేశంతో పోటీ పడవలసి ఉంటుంది. ఇది సిగ్గుచేటు" అని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: