సైనిక అవసరాల కోసం భారత వైమానిక దళం(ఐఏఎఫ్) మరో ప్రాజెక్టుకు ఆమోదం తెలపనుంది. 56 రవాణా ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకుగాను సుమారు రూ. 18వేల కోట్ల వరకు వెచ్చించనున్నారు. ఈ మెగాప్రాజెక్టులో ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ తో పాటు మరో భారతీయ సంస్థ భాగం కానుందని స్పష్టం చేశారు. మేకిన్ ఇండియాలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
కొనుగోలు చేయనున్న మొత్తంలో సుమారు 40 విమానాలను ఎయిర్ బస్తో పాటు భారత్‌కు చెందిన కంపెనీ మన దేశంలో తయారు చేయనుంది. దీంతో రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఐఏఎఫ్ వద్ద ఉండే ఏవీఆర్‌ఓ విమానా స్థానంలో కొత్తగా కొనుగోలు చేయనున్న వాటిని వినియోగించనుంది. దేశ సైనిక సామర్థ్యాలను పెంచే దిశగా దీర్ఘకాలంగా ఉండిపోయిన ప్రాజెక్టులకు రక్షణ మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపుతోంది.