కరోనా రెండో దశ ఉద్ధృతిపై అప్రమత్తం కావడంలో భారత సమాజం, ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్- అహ్మదాబాద్ ప్రొఫెసర్ చిన్మయ్ తుంబే అన్నారు. దీనికి రెండు కారణాలను చూపారు.
- కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు, ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం. కరోనా పోయిందని అనుకోవడం.. తద్వారా మరో దశ వైరస్ వ్యాప్తిపై నిర్లక్ష్యం వహించడం.
- కరోనా కొత్త రకాలను ప్రభుత్వం గుర్తించకపోవడం.
'ది ఏజ్ ఆఫ్ పెండమిక్స్: హౌ దే షేప్డ్ ఇండియా అండ్ ది వరల్డ్' పుస్తకాన్ని తుంబే రాశారు. కరోనా వ్యాప్తికి కారణాలేంటి? అది మళ్లీ తిరగబెడుతుందా? తిరగబెడితే ప్రజలు, ప్రభుత్వం ఏం చేయాలి? తదితర అంశాలపై ఆయన విశ్లేషణ చేశారు.
కరోనా ఇపట్లో తగ్గుముఖం పడుతుందా? మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉందంటారా ?
తుంబే: కరోనా భవిష్యత్తులో మళ్లీ వ్యాపించే అవకాశం ఉంది. కనీసం మరో రెండు, మూడు సంవత్సరాల పాటు కరోనాపై అప్రమత్తత అవసరం.
కరోనాను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం ఏం చేసి ఉండాల్సింది?
తుంబే: కరోనాను నియంత్రించడంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు ఏం చేశాయో మనం చూశాం. వైరస్ కట్టడికి అవి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ఆర్థిక కార్యకలాపాలను కూడా చాలా ఆలస్యంగా తిరిగి మొదలు పెట్టాయి.
అయితే కరోనా వెనుక చాలా శాస్త్రపరిజ్ఞానం ఉందని భారత్ మర్చిపోయింది. మీరే చూడండి.. కరోనా ఇంతలా వ్యాపిస్తుంటే కుంభమేళాకు ఎలా అనుమతించారు?
గతేడాదే కేంద్రం, రాష్ట్రాలు ఆక్సిజన్ సిలిండర్లను, ఐసీయూ పడకల్ని పెద్ద ఎత్తున సమకూర్చాల్సి ఉంది. కానీ ఆ పని చేయలేదు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కరోనా పట్ల నిర్లక్ష్యం భయంకరంగా కట్టలు తెంచుకుంది.
మరో దశ కరోనా వ్యాప్తిపై భారత్ ఎలా పోరాడాలి?
తుంబే: ఆక్సిజన్ సిలిండర్లను పెద్ద ఎత్తున సమకూర్చుకోవాలి. దాంతో పాటు పడకల్ని, వెంటిలేటర్లను సమకూర్చుకోవాలి. కరోనా తగ్గుముఖం పట్టినా.. ఆక్సిజన్ సిలిండర్లు, పడకలను ఇప్పుడున్న వాటికంటే పది రెట్లు, ఇరవై రెట్లు అధికంగా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు కరోనా వ్యాప్తి తీవ్రంగాా ఉంది. తక్షణమే దాన్ని అదుపులో పెట్టాలి.
ఇదీ చదవండి: వ్యాక్సినేషన్ 3.0పై కేంద్రం కీలక మార్గదర్శకాలు