భారత్.. వ్యాక్సిన్ హబ్‌గా ఆవిర్భవించాలని ఆరోగ్య రంగ నిపుణులు ఆకాంక్షించారు. కొవాక్స్ కార్యక్రమం కింద ఇప్పటికే 3.3 కోట్ల డోసులను భారత్ పేద దేశాలకు పంపిణీ చేసిందని గుర్తు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
"గవీ-కొవాక్స్ అనేది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద పేద దేశాలకు టీకా పంపిణీ కోసం ఏర్పడిన సమాఖ్య. ఈ కార్యక్రమం కింద భారత్ ఇప్పటికే 3.3 కోట్ల డోసులను పంపిణీ చేసింది. ఇది భారత్‌లో పంపిణీ చేస్తున్న దాని కంటే మూడు రెట్లు ఎక్కువ. కొవిడ్‌పై ప్రపంచ పోరులో సహకరించడానికి భారత్ కట్టుబడి ఉందనడానికి ఇదో ఉదాహరణ. భారత్ వ్యాక్సిన్ హబ్‌గా ఆవిర్భవించాల్సిన అవసరం ఉంది. అయితే టీకా పంపిణీలో సమానత్వాన్ని ప్రపంచ దేశాల నాయకులు విస్మరించకూడదు."
-తమోరీష్ కొలే, ఏషియన్ సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ అధ్యక్షుడు
"మహమ్మారిపై పోరుకు తొలిసారిగా ఎన్నో దేశాలు ఏకమయ్యాయి. పేద దేశాలకు టీకా పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఇందులో భారత్‌లో టీకాల తయారీ కీలక పాత్ర పోషిస్తోంది. భారత్ నుంచి యూనిసెఫ్ 82 పేద, మధ్యతరగతి దేశాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేస్తుంది. డబ్ల్యూహెచ్ఓ నుంచి గుర్తింపు పొందిన వ్యాక్సిన్లలో వాటి ధరలను పరిశీలించి వాటిని ఈ పంపిణీ కార్యక్రమంలో భాగం చేస్తున్నాము. "
-డాక్టర్ యస్మీన్ అలీ హక్, భారత్‌లో యూనిసెఫ్ ప్రతినిధి
2021 చివరి నాటికి..
ఈ కొవాక్స్ కార్యక్రమంలో భాగంగా గవీ.. ఈ ఏడాది మార్చి నాటికి 8 కోట్ల డోసులను పంపిణీ చేయాలని నిశ్చయించింది. 2021 చివరి నాటికి 200 కోట్ల డోసులను అందించాలన్నది కొవాక్స్ కార్యక్రమం లక్ష్యం. ఈ కార్యక్రమం ద్వారా 92 పేద దేశాలకు వ్యాక్సిన్‌ను పంపుతున్నారు. వ్యాక్సిన్ పంపిణీలో అధిక శాతం భారత్‌కు చెందిన సీరం సంస్థే అందించడం గమనార్హం.
ఇదీ చదవండి : 'అంబానీ ఇంటి వద్ద బాంబు'పై ఎన్ఐఏ దర్యాప్తు