దేశంలో కరోనా టీకా తీసుకున్నవారికి బూస్టర్ డోసు(Booster Dose) ఇవ్వాలా? వద్దా? అని నిర్ణయించేందుకు అవసరమైన డేటా లేదని నిపుణులు తెలిపారు. స్థానికంగా లభించే శాస్త్రీయ ఆధారాలను పరిశీలించిన తర్వాత దీనిపై ఓ స్పష్టతకు రావచ్చని చెప్పారు. ప్రస్తుతం దీనిపై పరిశోధలు జరుగుతున్నాయన్నారు.
"శాస్త్రీయ ఆధారాలకు అనుగుణంగా బూస్టర్ డోసుపై భారత్ నిర్ణయం తీసుకుంటుంది. బుస్టర్ డోసు అవసరమా? ఒకవేళ ఇవ్వాల్సి వస్తే రెండు డోసుల తీసుకున్నాక ఎంత విరామం ఉండాలి? అనే విషయాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. బూస్టర్ డోసు వల్ల ప్రతికూల ప్రభావం కూడా లేకుండా చూసుకొవాలి."
డా. ఎన్కే అరోడా, ఎన్టీఏజీఐ ఛైర్మన్
కేంద్రం హోంశాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ దేశంలో కరోనా థర్డ్ వేవ్(corona third wave in india) సెప్టెంబర్- అక్టోబర్ మధ్య ఏ సమయంలోనైనా ఉద్ధృతం కావచ్చని ఇప్పటికే స్పష్టం చేసింది. అందుకే వీలైనంత ఎక్కువమంది ప్రజలకు టీకా అందేలా వ్యాక్సినేషన్ ప్రక్రియను(vaccination in india) మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని సూచించింది.
ఆధారాల్లేవ్..
టీకా రెండు డోసులు తీసుకున్నవారికి బూస్టర్ డోసు(corona booster dose) అవసరమని చెప్పేందుకు ఇప్పటి వరకు ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదని ఎయిమ్స్ డైరక్టర్ డా.రణ్‌దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న వారికి డెల్టా వేరియంట్ సహా ఇతర రకాల వైరస్ల నుంచి రక్షణ లభిస్తుందని, మరణాల రేటు కూడా తగ్గుతున్నట్లు పేర్కొన్నారు.
"దేశంలో టీకా ఒక్కడోసు కూడా తీసుకోని వారు ఇంకా చాలా మంది ఉన్నారు. వ్యాధి తీవ్రత, మరణాల రేటు తగ్గించాలంటే మూడో దశలో వైరస్ ముప్పు అధికంగా ఉన్న వాళ్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రస్తుతానికి బూస్టర్ డోసులు అవసరం లేదు. మరింత డేటా అందుబాటులోకి వచ్చాక బూస్టర్ డోసు ఎప్పుడు ఇవ్వాలి, ఎలాంటిది ఇవ్వాలి అనే దానిపై స్పష్టత వస్తుంది."
- డా.రణ్‌దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్
కొవిడ్-19 వ్యాక్సిన్ నిర్వహణపై ఏర్పాటైన జాతీయ నిపుణుల కమిటీ(ఎన్టీఏజీఐ).. బూస్టర్ డోసుపై చర్చించిందని, దీనిపై లోతుగా అధ్యయనం చేస్తోందని నీతి ఆయోగ్ సభ్యులు డా.వీకే పాల్ ఈ నెల మొదట్లోనే తెలిపారు.
అమెరికా, ఇజ్రాయెల్ సహా మరికొన్ని దేశాలు వ్యాక్సినేషన్ పూర్తయిన వారికి బూస్టర్ డోసు ఇచ్చే యోచనలో ఉన్నాయి.
మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ.. బూస్టర్ డోసు పంపిణీని రెండు నెలల పాటు ఆలస్యం చేయాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా టీకాల కొరత ఉన్నందున మూడో డోసును ఇప్పట్లో ప్రారంభించవద్దని సూచించింది.
ఇదీ చూడండి: అంతుచిక్కని జ్వరం.. ఐదుగురు చిన్నారులు మృతి!