India Covid Vaccination: కరోనా టీకా పంపిణీలో భారత్ ఆదివారం(జులై 17) మరో మైలురాయి సాధించింది. ఇప్పటివరకు 200 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది. ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత్ మరోసారి చరిత్ర సృష్టించిందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా భారత ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ ఘనతను సాధించేందుకు కృషి చేసినవారి పట్ల గర్వంగా ఉందని మోదీ అన్నారు. భారతీయులు సైన్స్ మీద అత్యంత విశ్వాసం కనబరిచారని పేర్కొన్నారు. వైద్యులు, నర్సులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, శాస్త్రవేత్తలు, ఎంటర్‌ప్రెన్యూయర్లు భూమిని సురక్షితంగా మార్చడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వారి సంకల్పం, అంకితభావాన్ని ప్రశంసిస్తూ మోదీ ట్వీట్ చేశారు.
2021 జనవరి 16న భారత్ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ తొలుత ఆరోగ్య కార్యకర్తలతో ప్రారంభమైంది. అదే ఏడాది మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి టీకా పంపిణీ చేపట్టింది కేంద్రం. 45 ఏళ్లుపైబడిన వారికి ఏప్రిల్ 1న షురూ కాగా.. 18 ఏళ్లుపైబడిన వారికి టీకా పంపిణీని 2021 మే 1న ప్రారంభించింది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో 90 శాతం వయోజనులు టీకా రెండు డోసులు తీసుకున్నారు. దాదాపు 98 శాతం మంది.. కనీసం వ్యాక్సిన్ ఒక డోసు పొందారు.
- 15-18 ఏళ్ల వయస్కుల్లో.. 68 శాతం మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోగా.. 82 శాతం మంది కనీసం ఒక డోసు పొందారు. వీరికి వ్యాక్సిన్ పంపిణీ ఈ ఏడాది జనవరి 3న ప్రారంభమైంది.
- 12-14 ఏళ్ల వారిలో.. 56 శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్ తీసుకోగా.. 81 శాతం మంది పిల్లలు కనీసం ఒక డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
- ఆంధ్రప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, చండీగఢ్, తెలంగాణ, గోవా.. 12 ఏళ్ల పైబడినవారిలో 100 శాతం టీకా పంపిణీ చేసిన రాష్ట్రాలుగా నిలిచాయి.
- గతేడాది అక్టోబర్ 21న కరోనా టీకా పంపిణీలో భారత్.. 100 కోట్ల మైలురాయిని.. 2022 జనవరి 7న 150 కోట్ల మార్కును అధిగమించింది.