India-Central Asia Dialogue 2021: అఫ్గానిస్థాన్‌లో సమ్మిళిత ప్రభుత్వం అవసరమని మరోమారు నొక్కిచెప్పింది భారత్. అఫ్గాన్ ప్రజలకు సాయం చేసే దారులను వెతకాలని ఆసియా దేశాలకు పిలుపునిచ్చింది. ఎలాంటి అవరోధాలు లేని మానవతా సాయం అందుతుందనే భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్. ప్రపంచంలోని అన్ని దేశాలను కరోనా మహమ్మారి ప్రభావితం చేసిందని, ఇప్పటి వరకు 90 దేశాలకు భారత్ కొవిడ్-19 టీకాలు పంపించినట్లు తెలిపారు
దిల్లీలో 3వ భారత్-సెంట్రల్ ఆసియా సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు జైశంకర్.
"అఫ్గానిస్థాన్‌తో లోతైన చారిత్రక సంబంధాలను మనమంతా పంచుకుంటున్నాం. ఆ దేశం విషయంలో మన ఆందోళనలు, లక్ష్యాలు ఒక్కటే. అందులో నిజమైన సమ్మిళిత, ప్రాతినిధ్య ప్రభుత్వం, ఉగ్రవాదం, డ్రగ్ ట్రాఫికింగ్‌పై పోరాటం, అవరోధాలు లేని మానవతా సాయం, మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కుల పరిరక్షణ వంటివి కీలక అంశాలు. అఫ్గాన్ ప్రజలకు సహాయం చేసే మార్గాలను కనుక్కోవాలి."
- ఎస్ జైశంకర్, భారత విదేశాంగ శాఖ మంత్రి
4-సీ ప్రతిపాదన..
సెంట్రల్ ఆసియా దేశాలతో సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు జైశంకర్. అందుకోసం 4-సీ విధానాన్ని ప్రతిపాదించారు. అందులో కామర్స్(వాణిజ్యం), కెపాసిటీ ఎన్హాన్స్మెంట్(సామర్థ్యం పెంపు), కనెక్టివిటీ(అనుసంధానత), కాంటాక్స్(సంబంధాలు) ఉన్నాయి.
"ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్న పరిస్థితుల్లో మన సమావేశం జరుగుతోంది. కరోనా మహమ్మారి ప్రపంచ ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. మనం ఊహించిన సమాజం, సరఫరా గొలుసు, అధికారాన్ని పూర్తిగా మార్చి వేసింది. కొత్తగా ఉద్భవించే ముప్పును ఎదుర్కొనేందుకు బహుముఖ విధానం అవసరమని ఎత్తి చూపింది. భారత్‌కు మీకు స్థిరమైన భాగస్వామి."
- ఎస్ జైశంకర్, భారత విదేశాంగ శాఖ మంత్రి.
ఈ సమావేశంలో కజకిస్థాన్ మంత్రి ముఖ్తార్ తిలియుబెర్ది, కిర్గిజ్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి రుస్లాన్ కజక్బావ్, తజకిస్థాన్ విదేశాంగ మంత్రి సిరోజిద్దిన్ ముహ్రిద్దిన్, తుర్కెమిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: