తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంట మిగిలిన సమస్యల పరిష్కారం కోసం భారత్, చైనా శుక్రవారం లోతైన చర్చలు జరిపాయి. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ ఒప్పందం వల్ల మిగిలిన అంశాల్లో సత్వర పరిష్కారానికి మార్గం సుగమమైనట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
త్వరలోనే మరోసారి..
క్షేత్రస్థాయిలో సంయమనం పాటించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా ఉండేందుకు చర్చల్లో ఇరు దేశాలు అంగీకరించాయి. దౌత్య, సైనిక పరమైన చర్చల ద్వారా సత్సంబంధాలు కొనసాగించాలని నిర్ణయించాయి. త్వరలోనే 11వ దశ సైనిక చర్చలు జరపడానికి అంగీకరించాయి.
అన్ని వివాదాస్పద ప్రంతాల నుంచి సత్వరమే పూర్తిగా బలగాల ఉపసంహరణ జరగాలంటే ఇరు దేశాలు చర్చలు కొనసాగించాలని విదేశాంగ శాఖ పేర్కొంది. తద్వారా సరిహద్దుల్లో త్వరితగతిన శాంతి, సుస్థిరత నెలకొంటాయని ఆశాభావం వ్యక్తంచేసింది.
ఇదీ చూడండి: 'ఇరు దేశాలు ఆధిపత్య ధోరణి వీడాలి'