స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో.. దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో అత్యుత్తమ ధైర్యసాహసాలు, అంకితభావాన్ని ప్రదర్శించిన సైనిక, పోలీసు దళాలకు కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. వీరిలో పలువురు విధి నిర్వహణలో అసువులు బాశారు. ఉగ్రవాదంపై అలుపెరగని పోరు సాగిస్తున్న జమ్ముకశ్మీర్ పోలీసులకు ఈ దఫా అత్యధిక స్థాయిలో పతకాలు దక్కాయి. శాంతి సమయంలో ఇచ్చే మూడు అత్యున్నత పతకాలు అశోక్ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్రలను ఒకేసారి ఈ దళాన్ని వరించాయి. ఇలా మూడింటినీ ఒకే విడతలో దక్కించుకోవడం ఇదే మొదటిసారి. మొత్తం మీద కేంద్ర, రాష్ట్ర పోలీసు దళాల్లోని 1,380 మందికి పతకాలను ప్రభుత్వం ప్రకటించింది.
వీరోచితం..
జమ్ముకశ్మీర్ పోలీసు విభాగంలో ఏఎస్‌ఐ బాబురామ్.. గత ఏడాది పఠాన్‌చౌక్ వద్ద ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరోచితంగా పోరాడి, అసువులు బాశారు. ఆయనకు అశోక్ చక్రను ప్రభుత్వం ప్రకటించింది. ఇదే రాష్ట్రానికి చెందిన కానిస్టేబుల్ అల్తాఫ్ హుస్సేన్.. తన రక్షణలో ఉన్న వ్యక్తిని కాపాడే క్రమంలో నేలకొరిగారు. ఆయన కీర్తి చక్రకు ఎంపికయ్యారు. అవంతిపొరాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన ప్రత్యేక పోలీసు అధికారి (ఎస్‌పీఓ) షాబాజ్‌కు శౌర్య చక్రను ప్రభుత్వం ప్రకటించింది.
- సైన్యంలో ఆరుగురికి శౌర్య చక్రను ప్రభుత్వం ప్రకటించింది. వీరంతా జమ్ముకశ్మీర్‌లో గత ఏడాది ఉగ్రవాదులతో జరిగిన పోరులో అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించారు. వీరిలో మేజర్ అరుణ్ కుమార్ పాండే, మేజర్ రవి కుమార్ చౌధురి, కెప్టెన్ అశుతోష్ కుమార్ (మరణాంతరం), కెప్టెన్ వికాస్ ఖత్రి, రైఫిల్ మ్యాన్ ముకేశ్ కుమార్, సిపాయి నీరజ్ అహ్లవాత్ ఉన్నారు. నలుగురికి బార్ టు సేనా మెడల్, 116 మందికి సేనా పతకాలు లభించాయి.
- 2019లో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో నలుగురు మావోయిస్టులను హతమార్చడంలో కీలక పాత్ర పోషించిన సీఆర్పీఎఫ్‌లోని ముగ్గురు 'కోబ్రా' కమాండోలకు శౌర్య చక్ర దక్కాయి.
పోలీసు పతకాలు..
కేంద్ర, రాష్ట్ర పోలీసు సిబ్బందికి ప్రకటించిన 1380 పతకాల్లో.. రెండు రాష్ట్రపతి పోలీసు సాహస పతకాలు (పీపీఎంజీ), 628 పోలీసు సాహస పతకాలు, (పీఎంజీ), 88 రాష్ట్రపతి పోలీసు పతకాలు, 662 పోలీసు పతకాలు ఉన్నాయి. ఈ సాహస పురస్కారాల్లో అత్యధికం (257) జమ్ముకశ్మీర్ పోలీసులకు దక్కాయి. ఆ తర్వాతి స్థానంలో సీఆర్పీఎఫ్ (151) ఉంది.
- భారత్-టిబెట్ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ) దళానికి 23 సాహస పతకాలు వరించాయి. వీటిలో 20 పురస్కారాలు.. గత ఏడాది మే-జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన 20 మందికి వీటిని ప్రకటించారు.
- ఒక ట్రక్కులో నక్కి, కశ్మీర్ లోయలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడంలో కీలకంగా వ్యవహరించిన నలుగురు సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి పీఎంజీలు వరించాయి.
- జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు చెందిన డీఎస్పీ అనిల్ కుమార్‌కు రాష్ట్రపతి పోలీసు పతకం, ఇన్‌స్పెక్టర్ నీరజ్ కుమార్, ఏఎస్సై సంజీవ్ వాలియాకు పోలీసు పతకం దక్కాయి.
- సీబీఐలో జాయింట్ డైరెక్టర్ మనోజ్ శశిధర్ సహా 30 మందికి పతకాలు వరించాయి.
ఇదీ చూడండి: భరతమాతకు స్వాతంత్ర్యం- ఎందరో మహానుభావుల త్యాగఫలం