కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కీలక సూచనలు చేసింది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించి ఆంక్షలను తీవ్రతరం చేయాలని కోరింది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఎంపిక చేసిన నిర్ధిష్ట ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేయడం అనివార్యమని తెలిపింది.
ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఆంక్షలు విధించే విషయంలో జిల్లా అధికారులు జాగ్రత్త వహించాలని అన్నారు. ఇదే తరుణంలో సంస్థాగతంగా ఆంక్షలను విస్తృతంగా, సమర్థవంతంగా అమలు చేయాలని వివరించారు.
గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ రేటు బాగా పెరిగిందని గుర్తు చేశారు. ఇటువంటి తరుణంలో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి కఠినమైన నియంత్రణ చర్యలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఇదీ చూడండి: కొవిడ్ కట్టడిపై సీడీఎస్ రావత్‌తో మోదీ భేటీ