Gita Gopinath meets PM modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) ముఖ్య ఆర్థికవేత్త, ఇండో-అమెరికన్ గీతా గోపీనాథ్.. దిల్లీలో బుధవారం సమావేశమయ్యారు. పలు కీలక విషయాలపై వారిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ఐఎంఎఫ్ మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఇటీవల పదోన్నతి పొందిన తర్వాత.. మోదీతో గీతా గోపీనాథ్ భేటీ కావడం గమనార్హం. ఈ సమావేశం గురించి ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇరువురి ఫొటోలను షేర్ చేసింది.
Imf gita gopinath: ప్రస్తుతం ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్న గీతా గోపీనాథ్‌కు.. డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్‌గా పదోన్నతి కల్పిస్తున్నట్లు ఐఎంఎఫ్ ప్రకటించింది. ఐఎంఎఫ్‌లో మొత్తం నలుగురు డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్లు ఉంటారు. జెఫ్రె ఓకమోటో.. వచ్చే ఏడాది తొలినాళ్లల్లో ఐఎంఎఫ్ నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో గీతా గోపీనాథ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
గీతా గోపీనాథ్ గురించి ఆసక్తికర విషయాలు..
- 1971లో కోల్‌కతాలో జన్మించారు. మైసూర్‌లోని నిర్మలా కాన్వెంట్ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు.
- దిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ విమెన్‌లో బి.ఎ పూర్తి చేశారు. 1992లో దిల్లీ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ ఎకనామిక్స్ అభ్యసించారు.
- వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో మరోసారి ఎం.ఎ ఎకనామిక్స్‌లో చదివే అవకాశం రావడంతో తన ఐఏఎస్ ప్రణాళికలను పక్కన పెట్టేశారు. అనంతరం ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో ఉపకారవేతనంతో పీహెచ్‌డీ పూర్తి చేశారు. తర్వాత షికాగో విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు.
- అక్కడి నుంచి 2010లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పూర్తిస్థాయి ప్రొఫెసర్‌గా చేరారు. అక్కడ ఉండగానే 2018లో ఐఎంఎఫ్‌లో పనిచేసే అవకాశం తలుపు తట్టింది.
- గీతా గోపీనాథ్‌కు ఫ్యాషన్ రంగంలోనూ అనుభవం ఉంది. దిల్లీ వర్సిటీలో ఆమె తన భర్త ఇక్భాల్ సింగ్‌ను కలిశారు. ప్రస్తుతం వీరికి 18 ఏళ్ల రాహిల్ అనే అబ్బాయి ఉన్నాడు.
ఇదీ చూడండి: ప్రపంచంలో అత్యంత ఆరాధించే వ్యక్తుల్లో మోదీకి 8వ స్థానం
ఇదీ చూడండి: 'సెమీకండక్టర్స్‌పై కేబినెట్ నిర్ణయం.. ఆవిష్కరణలకు ఊతం'