Maharashtra Rain: రుతుపవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబయిని వర్షాలు ముంచెత్తాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా వరద నీరు చేరగా.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పట్టాలు మునిగిపోయి స్థానిక రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీంతో లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారిమళ్లించారు.
ముంబయిలో గత సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే బుధ, గురు, శుక్రవారాల్లో మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ముంబయికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఠాణేలో వ్యక్తి మృతి..
ముంబయి సహా ఠాణే, పాల్ఘర్ జిల్లాలను కూడా వర్షాలు ముంచెత్తాయి. ఠాణేలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డుపై గుంత కారణంగా కింద పడ్డాడు. అదే సమయంలో వచ్చిన బస్సు అతడి పైనుంచి వెళ్లగా.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వర్షాల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే మంగళవారం.. అధికారులతో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని.. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: 'అగ్నిపథ్'కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు.. చరిత్రలో తొలిసారి..
టీఎంసీకి మహువా మొయిత్రా గుడ్‌బై? అరెస్ట్ చేయాలని భాజపా డిమాండ్!