IIT placements 2021: దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థులపై కనక వర్షం కురిసింది. గురువారం ప్రాంగణ నియామకాల తొలిరోజే భారీస్థాయిలో వేతనాలు చెల్లించి విద్యార్థులను సొంతం చేసుకునేందుకు పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలు పోటీ పడ్డాయి. కొవిడ్‌కు ముందు ప్యాకేజీల కంటే ఇవి ఎక్కువగా ఉండటం గమనార్హం.
రూ. కోటికి పైగా వేతనాలుండే దాదాపు 60 కొలువులు దిల్లీ ఐఐటీ విద్యార్థుల పరమవ్వడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే 45% ఎక్కువ ఉద్యోగాలను సంస్థలు ఇవ్వజూపాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐఐటీ రూర్కీకు చెందిన ఓ విద్యార్థికి ఏకంగా రూ.2.15 కోట్ల వార్షిక ప్యాకేజీ చెల్లించటానికి ఓ అంతర్జాతీయ టెక్ సంస్థ ముందుకొచ్చింది. ఉబర్ సంస్థ.. ఓ ఐఐటీ బాంబే విదార్థి కోసం రూ.2.05 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైంది. ఐఐటీ గువాహటి విద్యార్థికి కూడా రూ.2 కోట్ల ప్యాకేజీని ఓ సంస్థ ప్రతిపాదించింది. ఐఐటీ-బీహెచ్‌యూ విద్యార్థులూ సత్తా చూపారు. 55 సంస్థలు ఇక్కడి విద్యార్థులకు 232 కొలువులిచ్చాయి. ఐఐటీ మద్రాస్‌లోనూ ఇదే జోరు. 34 సంస్థలు దాదాపు 176 మందికి భారీ వేతనాలతో ప్యాకేజీలు ప్రకటించాయి.
"తొలిరోజు మా విద్యార్ధులు దాదాపు 400 కొలువులు సంపాదించారు. గత ఐదేళ్లలో ఇదే అత్యధికం. కొందరు విద్యార్థులకు రెండు మూడు ఆఫర్లు వచ్చాయి" అని ఐఐటీ దిల్లీ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రాంగణ నియామకాల్లో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, గోల్డ్‌మ్యాన్ శాక్స్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలు పాల్గొన్నాయి. విదేశాల్లో పనిచేసేవారి కంటే తొలిసారి భారత్‌లో పనిచేసేవారికి ఎక్కువ జీతాలు ఇస్తున్నామని కొన్ని సంస్థలు తెలపడం విశేషం.
ఇదీ చూడండి: 'బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు.. మరో ఐదుగురికి..'