కొవిడ్ సంక్రమణపై ఐఐటీ మద్రాస్‌కు చెందిన పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. శ్వాస నెమ్మదిగా తీసుకుంటే.. ఊపిరితిత్తుల్లోకి వైరస్ కణాలు ఎక్కువగా చొచ్చుకుపోతాయని వారు చెబుతున్నారు. వీరి అధ్యయనాన్ని 'ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్' అనే జర్నల్ ప్రచురించింది.
ఎలా తెలుసుకున్నారు?
శ్వాస బిగపట్టడం లేదా తక్కువగా వేగంతో శ్వాస తీసుకంటే.. వైరస్ కణాలు ఎక్కువ సేపు ఊపిరితిత్తుల్లో నిల్వ ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. తద్వారా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరిస్తున్నారు. ఊపిరితిత్తుల నిర్మాణం కూడా కొవిడ్ వ్యాధి ఇన్ఫెక్షన్లో కీలక పాత్ర పోషిస్తుందని వీరు వివరిస్తున్నారు. తమ లేబొరేటరీలో శ్వాస పౌనఃపున్యాన్ని గమనించడం ద్వారా పరిశోధకులు ఈ విషయాన్ని నిర్ధరించారు. ఐఐటీ మద్రాస్‌లోని అప్లయిడ్ మెకానిక్స్ విభాగానికి చెందిన అధ్యాపకుడు మహేశ్ పంచాగ్నులా ఆధ్వర్యంలో ఈ అధ్యయనం జరిగింది. పరిశోధక విద్యార్థులు అర్ణవ్ కుమార్ మాలిక్, సౌమల్యా ముఖర్జీ ఇందులో పాల్గొన్నారు.
"శ్వాసకోశ సంబంధిత సమస్యలపై అవగాహన పెంచుకోవడానికి కరోనా వైరస్ ఒక మార్గం చూపింది. ఊపిరితిత్తుల్లోకి కణాలు ఎలా ప్రయాణిస్తాయి, ఎలా పేరుకుపోతాయి వంటి అంశాలను మా అధ్యయనం వివరిస్తుంది. గాలిలోని తుంపరల ద్వారా వైరస్ ఎలా ప్రయాణిస్తుందో మేము అధ్యయనం చేశాం."
--మహేశ్ వి.పంచాగ్నులా, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్.
శ్వాసకోశ సంబంధిత సమస్యలకు మెరుగైన చికిత్స అందించడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని ఈ పరిశోధక బృందం విశ్వసిస్తోంది. తుంపరల ద్వారా వైరస్.. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఎలా సంక్రమిస్తుందోనని ఈ బృందం అంతకుముందు చేసిన అధ్యయనంలో వివరించింది.
దగ్గు, తుమ్ముల వంటి వల్ల కరోనా వంటి వైరస్ కణాలు పెద్దఎత్తున వ్యాపిస్తాయని తాజాగా చేసిన పరిశోధనలో వీరు తేల్చారు. ఇందుకోసం కృత్రిమంగా శ్వాసనాళిక వంటి నిర్మాణం, నెబ్యులైజర్‌ను ఉపయోగించి పరిశోధన చేశారు.
ఇదీ చూడండి:రహస్య ప్రదేశంలో భారత్ టీకాలు.. ఎందుకంటే?