IIT Kanpur soil testing: అన్నదాతలకు భూసార పరీక్షల ఇబ్బందులను దూరం చేసే అద్భుత సాధనాన్ని భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా.. 90 సెకన్లలోనే ఫలితాన్ని అందించడం దీని ప్రత్యేకత. ఈ పరీక్ష కోసం 5 గ్రాముల మట్టి నమూనాలు సరిపోతాయి. కాన్పుర్‌లోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కారం చేశారు.
IIT kanpur innovations
రైతులు ఎదుర్కొనే ఇబ్బందుల్లో భూసార పరీక్షలు ఒకటి. ఈ పరీక్ష చేయించడం, ఆ ఫలితాలను ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న ల్యాబ్‌ల నుంచి పొందడానికి అన్నదాతలు రెండు వారాలపాటు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ ఇబ్బందిని అధిగమించడానికి శాస్త్రవేత్తలు కొత్త పరికరాన్ని తయారుచేశారు.
Soil testing portable device
'నియర్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కొపీ' సాంకేతికతో ఈ సాధనాన్ని అభివృద్ధి చేశారు. ఇది నేల తీరుతెన్నులను అప్పటికప్పుడు విశ్లేషించి, ఆ సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్‌పై అందిస్తుంది. ఇందుకోసం 'భూ పరీక్షక్' పేరుతో ఒక మొబైల్ యాప్‌ను రూపొందించారు. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి పొందొచ్చు.
పనిచేసేది ఎలా?
- ఇది పోర్టబల్ భూ పరీక్ష సాధనం. నేలలోని పోషకాలను గుర్తించడానికి ఐదు గ్రాముల పొడి నమూనాలను 5 సెంటీమీటర్ల పొడవైన గొట్టం లాంటి ఆకృతిలో వేయాలి. బ్లూటూత్ లేదా వైరు సాయంతో ఇది తనంతట తానుగా మొబైల్ ఫోన్‌తో సంధానమవుతుంది.
- ఆ వెంటనే నమూనాలోని పోషకాల విశ్లేషణ మొదలుపెడుతుంది. నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, ఆర్గానిక్ కార్బన్, మట్టి, నేలలోని క్యాట్ అయాన్ మార్పిడి సామర్థ్యం వంటి అంశాలను విశ్లేషిస్తుంది.
- 90 సెకన్లలో ఈ విశ్లేషణ పూర్తవుతుంది. ఈ ఫలితం.. భూసార నివేదిక రూపంలో స్క్రీన్‌పై కనిపిస్తుంది. ప్రత్యేక ఐడీతో భూ పరీక్షక్ క్లౌడ్ సర్వీస్‌పై దీన్ని పొందొచ్చు.
- నమూనాలోని పోషకాల స్థాయి, సాగు చేస్తున్న పంట రకాన్ని బట్టి ఆ నేలలో ఏ ఎరువులను, ఏ మిశ్రమాల్లో వాడాలన్నది కూడా ఈ సాధనం సూచిస్తుంది.
చాలా సులువు
ఈ మొబైల్ యాప్‌ను యూజర్ ఇంటర్‌ఫేస్ ద్వారా చాలా సులువుగా వాడగలిగేలా తీర్చిదిద్దారు. రైతులకు స్థానిక భాషల్లోనూ ఇది సమాచారం ఇస్తుంది. 8వ తరగతి చదివిన వ్యక్తి కూడా దీన్ని సులభంగా ఉపయోగించగలుగుతాడు.
- మొత్తంమీద ఒక్క సాధనంతో దాదాపు లక్ష నమూనాలను పరీక్షించొచ్చు.
ఇదీ చదవండి: కరోనా కాలంలో ఎంతమంది పిల్లలు అనాథలయ్యారంటే?