కరోనా అతని సంకల్పాన్ని కుంగదీయలేదు. వైరస్‌తో పోరాడుతున్న సమయంలోనే తన లక్ష్యాన్ని చేరుకునేందుకు మరింతగా సన్నద్ధమయ్యాడు. అందుకే.. కొవిడ్ నుంచి కోలుకున్న ఏడు వారాల్లోనే తాను అనుకున్నది సాధించాడు. అతడే ఐఐటీ దిల్లీ పూర్వ విద్యార్థి నీరజ్ చౌదరీ. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి.. మువ్వన్నెల జెండాను ఎగరేసి అందరితో ప్రశంసలు అందుకున్నాడు.
రాజస్థాన్‌కు చెందిన 37 ఏళ్ల నీరజ్.. 2009-11 మధ్య దిల్లీ ఐఐటీ నుంచి ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్లో ఎంటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం అతడు రాజస్థాన్ ప్రభుత్వ నీటి వనరుల శాఖలో పని చేస్తున్నాడు. 2014 నుంచి నీరజ్.. పర్వాతారోహణ చేయడం మొదలుపెట్టాడు. 2020లో భారత పర్వతారోహకుల సమాఖ్య(ఐఎంఎఫ్)లో సభ్యుడిగా ఎంపికయ్యారు. అయితే కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో గతేడాది ఎవరెస్టు యాత్ర వాయిదా పడింది.
వైరస్ బ్రేక్...
ఈ ఏడాది ఎవరెస్టు అధిరోహించేందుకు నేపాల్ ప్రభుత్వం మళ్లీ అనుమతులు ఇచ్చింది. దాంతో కరోనా రెండో దశ వ్యాప్తి ఇంకా మొదలవ్వని సమయంలో.. నేపాల్‌లోని కాఠ్మాండూకు చేరుకున్నాడు నీరజ్. అయితే, అక్కడి బేస్ క్యాంపులో నిర్వహించిన పరీక్షల్లో అతనికి కరోనా సోకినట్లు తేలింది.
"కరోనా పాజిటివ్‌గా తేలాక నా ఎవరెస్టు అధిరోహణ యాత్రకు బ్రేకు పడింది. దాంతో నేను మళ్లీ జైపుర్‌కు చేరుకున్నాను. కొవిడ్ సోకినప్పుడు.. కొన్నిరోజుల పాటు ఆయాసం తప్ప మరే ఇతర లక్షణాలు లేవు. ఆ సమయంలో నేనసలు కరోనా గురించి ఏమీ ఆలోచించలేదు. అప్పుడు నా ధ్యాస అంతా.. మళ్లీ నేను ఎవరెస్టు ఎక్కేందుకు ఎలా సన్నద్ధమవ్వాలన్న దానిపైనే ఉండేది. 'ఈసారి నేను ఎవరెస్టును అధిరోహించకపోతే.. మళ్లీ నాకంటూ రెండో అవకాశం లేదు' అని నాకు నేను ప్రేరణ పొందాను. ఫలితంగా నేను నా లక్ష్యాన్ని సాధించగలిగాను."
-నీరజ్ చౌదరీ, పర్వతారోహకుడు
మానసికంగా కలవరపడ్డా..
మార్చి 27న కరోనా బారిన పడ్డ నీరజ్.. అనంతరం వైరస్ నుంచి కోలుకున్నాక తిరిగి ఏప్రిల్‌లో కాఠ్మాండూకు చేరుకున్నాడు. మే 31న అతడు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. ఎవరెస్టు అధిరోహించేదుకు కాఠ్మాండూలోని బేస్ క్యాంపుకు చేరుకున్నాక భారత్‌లో కరోనా వ్యాప్తి, దాంతో పాటు ఏర్పడ్డ తుపాను పరిస్థితులు తనను కలవరానికి గురిచేశాయని చెప్పాడతడు.
"పర్వతారోహణ అంటే శారీరకంగా శ్రమిస్తేనే సరిపోదు. మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. నేను 36 గంటల్లో మూడు సార్లు ప్రయత్నించి ఎవరెస్టు శిఖరాన్ని చేరుకోగలిగాను. మే 31న నేను ఎవరెస్టును అధిరోహించడం నాకు మరిచిపోలేని అనుభూతిని కలిగించింది."
-నీరజ్ చౌదరీ, పర్వాతారోహకుడు
పర్వతారోహణలో తనకు మార్గనిర్దేశనం చేసిన ఐఐటీ దిల్లీకి నీరజ్ కృతజ్ఞతలు చెప్పాడు. అతని యాత్ర కోసం ఐఐటీ దిల్లీ రూ.24 లక్షలను సేకరించి అందించింది. అందుకే.. ఎవరెస్టును అధిరోహించిన తర్వాత అతడు జాతీయ పతాకంతో పాటు తన కళాశాల పతాకాన్ని కూడా అక్కడ ఎగురవేశాడు.
ఇదీ చూడండి: వింత సమస్య.. ఆ యువకుడి నోట్లో 82 పళ్లు!
ఇదీ చూడండి: కూర్చుని తింటూనే.. లక్షలు సంపాదిస్తున్నాడు!