Bangalore Idly ATM : అనారోగ్యంతో ఉన్న కుమార్తెకు రాత్రి వేళ ఇడ్లీ తినిపించాలనుకున్న ఆ తండ్రికి అవి దొరకక నిరాశ ఎదురైంది. 2016లో జరిగిన ఈ ఘటన ఆయన్ను ఆలోచనలో పడేసింది. తనకొచ్చిన ఇబ్బంది మరెవరికీ రాకూడదనే కసి నుంచి ఓ వినూత్న ఆలోచన అంకురించింది. అదే 'ఇడ్లీ ఏటీఎం'గా బెంగళూరు ప్రజల ముందుకు రానుంది. కార్డు పెట్టి ఏటీఎం నుంచి డబ్బు తీసుకున్నట్లే.. ఇందులోంచి ఇడ్లీలు పొందొచ్చు.
బెంగళూరు నగరానికి చెందిన శరణ్ హిరేమఠ్ కంప్యూటర్ ఇంజినీరు. తన కుమార్తెకు జ్వరం వచ్చిన రోజు సమయానికి ఇడ్లీలు దొరక్కపోవడంతో స్నేహితులు సురేష్, చంద్రశేఖర్‌లతో కలిసి ఈ యంత్రాన్ని తయారు చేశారు. తయారీ, ప్యాకింగ్, సరఫరా ప్రక్రియలను యంత్రం నిమిషాల్లో చేస్తుంది.
12 నిమిషాల్లో 72 ఇడ్లీలను సరఫరా చేయగలదు. పొడి, చట్నీలనూ ప్యాక్ చేసి అందిస్తుంది. యంత్రం వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను ఫోన్‌లో స్కాన్ చేసి, వచ్చిన మెనూ ప్రకారం ఆర్డర్ చేస్తే సరి. ఆన్‌లైన్‌లోనే బిల్లునూ చెల్లించొచ్చు. బెంగళూరులోని బన్నేరుఘట్ట రహదారిలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: క్యాన్సర్‌ను మూడుసార్లు ఓడించిన 'ఐరన్ లేడీ'.. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ..
ఎన్నికల కాలం వస్తోంది.. గుజరాత్, తెలంగాణ, కర్ణాటక సహా 11 రాష్ట్రాల్లో..