కొవిడ్-19 నుంచి కోలుకున్నవారిలో మ్యుకర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) పెరిగిపోతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. వివిధ అనారోగ్య సమస్యలతో మందులు వాడుతున్న వారిలో పర్యావరణంలో ఉన్న సూక్ష్మక్రిములతో పోరాడే శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వారిలో మ్యుకర్‌మైకోసిస్ ప్రబలడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందని పేర్కొంది. ఈ ఇన్‌ఫెక్షన్ సోకినవారిలో కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబారడం, నొప్పి తలెత్తడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి అందకపోవడం, రక్తవాంతులు, మతిస్థిమితంలో మార్పులు వంటివి తలెత్తుతాయని తెలిపింది.
ఎందువల్ల వస్తుంది ?
- మధుమేహం అదుపులో లేనప్పుడు
- స్టిరాయిడ్స్ వినియోగం వల్ల రోగ నిరోధకశక్తి తగ్గిపోవడం
- ఐసీయూలో సుదీర్ఘకాలం ఉండటం
- ఇతరత్రా ఆరోగ్య సమస్యలు, అవయవ మార్పిడి/ కేన్సర్ వోరికొనాజోల్ థెరఫీ
ఈ లక్షణాలను జాగ్రత్తగా గమనించాలి
- మధుమేహం ఉన్న కొవిడ్ బాధితుల్లో రోగ నిరోధక వ్యవస్థను అదుపు చేయడానికి మందులు వాడినప్పుడు ఈ దిగువ లక్షణాలు కనిపిస్తే బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌గా అనుమానించాలి.
- సైనసైటిస్- ముక్కు రంధ్రాలు మూసుకుపోయినప్పుడు, ఇబ్బంది తలెత్తినప్పుడు, దవడ ఎముకలో నొప్పి తలెత్తినప్పుడు.
- మొహంలో ఒకవైపు నొప్పి, తిమ్మిరి, వాపు.
- ముక్కుపై నల్లరంగు ఏర్పడటం, పంటినొప్పి.
- కంటి నొప్పితోపాటు, చూపు మందగించడం, రెండుగా కనిపించడం. జ్వరం రావడం.
- ఛాతీలోనొప్పి, శ్వాసకోసవ్యవస్థలో తీవ్ర ఇబ్బందులు.
వ్యాధి నివారణకు
- హైపర్‌గ్లైసీమియాను నియంత్రణలో ఉంచుకోవాలి.
- కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత రక్తంలో గ్లూకోజ్‌ను పరిశీలిస్తూ, మధుమేహాన్ని అదుపులో ఉంచాలి.
- స్టిరాయిడ్స్, యాంటీ బయాటిక్స్‌ను సహేతుకంగా ఉపయోగించాలి.
- ఆక్సిజన్ థెరఫీ సమయంలో హ్యుమిడిఫైయర్స్ కోసం శుభ్రమైన నీటిని ఉపయోగించాలి.
ఎలా ఎదుర్కోవాలి
- మ్యుకర్‌మైకోసిస్‌కు సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి. స్టిరాయిడ్స్ తగ్గించాలి. రోగ నిరోధకశక్తిని అదుపులో ఉంచే మందులను వాడటం మానేయాలి. 4-6వారాలపాటు యాంటీఫంగల్ చికిత్స తీసుకోవాలి.
- రేడియో ఇమేజింగ్ ద్వారా రోగిలోని స్పందన, రోగ పురోగతిని పరిశీలించాలి. ఫంగల్ ఇటియాలజీని కనుగొనేందుకు కేఓహెచ్ స్టెయినింగ్, మైక్రోస్కోపీ, కల్చర్, మాల్డీటాఫ్‌లాంటి పరీక్షలు చేయించుకోవాలి.
జాగ్రత్తలు
- దుమ్ముతో కూడిన నిర్మాణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్కు ఉపయోగించాలి.
- మట్టి, ఎరువులు ముట్టుకొనేటప్పుడు, తోట పనిలాంటివి చేసేటప్పుడు బూట్లు, ఫ్యాంటు, పొడవు చేతుల చొక్కా వేసుకోవాలి.
- వ్యక్తిగత శుభ్రత పాటించాలి.
నిర్లక్ష్యమే భారత్ కొంపముంచింది
భారత్‌లో ప్రజలు కరోనా వ్యాప్తి ముగిసిందని పొరపడి.. మాస్కుల ధారణ వంటి నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఫలితంగా వైరస్ ఉద్ధృతి పెరిగిందని చెప్పారు. ప్రజలు గుమిగూడేందుకు, భారీస్థాయి సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇవ్వడం మహమ్మారి వ్యాప్తిని మరింత వేగవంతం చేసిందని పేర్కొన్నారు. గత అక్టోబరులో గుర్తించిన బి.1.617 రకం ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వ్యాపిస్తోందన్నారు. టీకాతో ఏర్పడే రోగ నిరోధకత నుంచి అది తప్పించుకునే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాపిస్తున్నకొద్దీ కొత్త రకాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయన్నారు. భారీ స్థాయిలో రూపాంతరం చెందే వైరస్ రకాలపై వ్యాక్సిన్లు పెద్దగా పనిచేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అదే జరిగితే ప్రపంచం మరోసారి భారీ ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి : కరోనా రెండో ఉద్ధృతికి పల్లెలు విలవిల