IAS Walk With Pet Dog: పెంపుడు శునకంతో నిత్యం వాకింగ్‌కి వెళ్లే ఓ ఉన్నతోద్యోగి.. అందుకోసం స్టేడియం మొత్తం ఖాళీ చేయిస్తున్న ఘటన దేశ రాజధానిలో జరిగింది. ఈ నిర్ణయం క్రీడాకారులు, శిక్షకులకు ఆటంకం కలిగించడంతోపాటు తీవ్ర విమర్శలకు కారణమైంది. బాధ్యతగా మెలగాల్సిన ఓ ఐఏఎస్ అధికారి చేస్తోన్న నిర్వాకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం వల్ల స్పందించిన దిల్లీ ప్రభుత్వం.. రాత్రి పది గంటల వరకు స్టేడియం అందరికీ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించింది.
దిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో సాధారణంగా సాయంత్రం ఏడు గంటలవరకు క్రీడాకారులు, శిక్షకులతో బిజీ ఉంటుంది. అయితే, దిల్లీ రెవెన్యూ కార్యదర్శి సంజీవ ఖిర్వార్ మాత్రం ఆ స్టేడియాన్ని తన పెంపుడు కుక్కతో వాకింగ్ చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. ఇందుకోసం నిర్ణీత సమయం కంటే (సాయంత్రం 7గంటలు) ముందే క్రీడాకారులను స్టేడియం నుంచి వెళ్లగొట్టాలని నిర్వాహకులకు సూచించారు. దీంతో సాయంత్రం ఏడు గంటలకంటే ముందు క్రీడాకారులు, శిక్షకులను బయటకు పంపిస్తున్నారు. అనంతరం ఓ అరగంట తర్వాత ఆ ఐఏఎస్ అధికారి తన పెంపుడు శునకంతో అక్కడకు చేరుకొని తాపీగా వాకింగ్ చేసుకుంటున్నారు.
గత కొన్ని నెలలుగా ఐఏఎస్ అధికారి చేస్తున్న నిర్వాకంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిత్యం రాత్రి 8.30 వరకు సాధన చేసేవాళ్లమని.. ఐఏఎస్ అధికారి తీరుతో తమకు ఆటంకం కలుగుతోందని క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడం వల్ల ప్రతిపక్షాలు కూడా ఐఏఎస్ తీరుపై మండిపడ్డాయి. దేశ రాజధానిలోని ఉన్నతాధికారులే ఇలా ప్రవర్తిస్తే ఇక జిల్లా స్థాయిలో వారితీరు ఎలా ఉంటుందునని కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారీ విమర్శలు గుప్పించారు.
ఇలా ఐఏఎస్ వాకింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం వల్ల దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. రాత్రి 10 గంటల వరకు నగరంలోని స్టేడియాలన్నీ క్రీడాకారులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా వెల్లడించారు. ఇదే విషయంపై సదురు ఐఏఎస్ అధికారిని మీడియా వివరణ కోరగా.. తనతోపాటు తన పెంపుడు శునకాన్ని అప్పుడప్పుడు వాకింగ్‌కు తీసుకువెళ్లిన మాట వాస్తవమేనన్నారు. అయితే, అది క్రీడాకారులు, శిక్షకులకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదని చెప్పుకొచ్చారు.
బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం.. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. స్టేడియాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై కేంద్రం.. దిల్లీ రెవెన్యూ కార్యదర్శి సంజీవ ఖిర్వార్ దంపతులను బదిలీ చేసింది. AGMUT క్యాడర్‌కు చెందిన 1994-బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఖిర్వార్‌ను లద్దాఖ్‌కు, ఆయన భార్య అను దుగ్గాలను అరుణాచల్ ప్రదేశ్‌కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది హోం మంత్రిత్వ శాఖ.
ఇవీ చదవండి: 'పుల్వామా దాడి' నిందితుడు అరెస్ట్.. జైషే సంస్థతో కుట్ర!
మెకానిక్‌లా వచ్చి ఆర్టీసీ బస్సు చోరీ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్