IAS Tina Dabi Marriage: తోటి ర్యాంకర్‌ను ప్రేమ పెళ్లి చేసుకుని.. విడాకులు తీసుకున్న ఐఏఎస్ 2016 టాపర్ టీనా దాబి మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన ఆమె.. కాబోయే భర్త ఫొటోలు పంచుకున్నారు. తన కంటే సీనియర్ అయిన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాండేను టీనా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.
ఇటీవలే వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. అందుకు సంబంధించిన ఫొటోలను టీనా ఇన్‌స్టాలో షేర్ చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం రాజస్థాన్ క్యాడర్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రదీప్ ప్రస్తుతం రాజస్థాన్‌లో పురాతత్వ, మ్యూజియం శాఖకు డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. టీనా కంటే ప్రదీప్ 13 ఏళ్లు పెద్ద కావడం గమనార్హం.
టీనా గతంలో ఐఏఎస్ అధికారి అధర్ అమిర్ ఖాన్‌ను వివాహం చేసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. 2016లో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో టీనా దాబి మొదటి ర్యాంకు సాధించగా.. అధర్ రెండో ర్యాంకులో నిలిచారు. అనంతరం శిక్షణ సమయంలో వీరి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది. అలా 2018లో ఏప్రిల్‌లో వీరు పెళ్లిచేసుకున్నారు. వీరిది మతాంతర వివాహం కావడంతో అప్పట్లో ఆ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ జంట పెళ్లికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అప్పటి కేంద్రమంత్రులు, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహజన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అయితే, రెండేళ్లకే వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో గతేడాది విడాకులు తీసుకున్నారు.
సివిల్స్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన తొలి దళిత మహిళగా టీనా పేరు అప్పట్లో మార్మోగింది. టీనాకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువే. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 14లక్షల మంది అనుసరిస్తున్నారు. ఇప్పుడు ప్రదీప్‌తో వివాహం గురించి టీనా పోస్ట్ చేయగానే.. అనేక మంది ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.