సోషల్ మీడియాలో బహిరంగంగా కీచులాటకు దిగిన ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూప మౌద్గిల్‌పై బదిలీ వేటు పడినా వారి మధ్య కోల్డ్ వార్ మాత్రం ఆగలేదు. బదిలీ వేటు పడిన మరుసటి రోజే ఐపీఎస్ రూప మౌద్గిల్ ఆడియో రికార్డు ఒకటి బయటికొచ్చింది. సంబంధిత ఆడియో క్లిప్పింగ్ ఒకటి బుధవారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
కర్ణాటక ప్రభుత్వం ఐఏఎస్ రోహిణి, ఐపీఎస్ రూపపై మంగళవారం బదిలీ వేటు వేసింది. వారికి పోస్టింగ్ ఇవ్వకుండానే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మీడియాకు ఎలాంటి ప్రకటనలు ఇవ్వకూడదని.. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోరాదని ఆదేశించింది. అయినా ఈ ఆదేశాలు బేఖాతరు అయ్యాయి. ఆర్టీఐ కార్యకర్త గంగరాజు, ఐపీఎస్ అధికారిణి రూప మౌద్గిల్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. ఈ ఆడియో క్లిప్‌ను బట్టి ఐఏఎస్ రోహిణి, ఐపీఎస్ రూప మౌద్గిల్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు అర్థమవుతోంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ ఆడియోలో రూప.. రోహిణి సింధూరి గురించి అసభ్యంగా మాట్లాడారు.
"రోహిణి సింధూరిపై ఫిర్యాదు చేయమని ఐపీఎస్ అధికారిణి రూప నన్ను బలవంతం చేశారు. రోహిణి సింధూరి ప్రైవేట్ చిత్రాలను రూప నాకు పంపించారు. రోహిణి సింధూరికి వ్యతిరేకంగా మాట్లాడాలని కోరారు. రూపపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా. రూపకు సంబంధించిన రెండు కాల్ రికార్డులు నా దగ్గర ఉన్నాయి. భూ ఒప్పందానికి సంబంధించి రూప నన్ను సీబీఐ అధికారిలా ప్రశ్నించారు. ఆమె ప్రశ్నలన్నింటికీ ఓపికగా సమాధానమిచ్చాను. అలా అని నేను రోహిణ సింధూరికి మద్దతుదారుడిని కాను."
-- గంగరాజు, ఆర్టీఐ కార్యకర్త
"రోహిణి సింధూరి కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. నా భర్త రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నారు. రూప భూములు కొనేటప్పుడు నా భర్త సాయం తీసుుకన్నారు. ఆస్తి కొనుగోలు సమయంలో నా భర్త అభిప్రాయాలను కోరారు. ఇప్పుడు రోహిణి వల్ల మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోహిణి క్యాన్సర్ రోగం లాంటి వ్యక్తి. ఆమె ఎవరినైనా ప్రభావితం చేస్తారు."
--ఐపీఎస్ రూపా మౌద్గిల్ ఆడియో క్లిప్
ఇదీ వివాదం
ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సోషల్ మీడియాలో రచ్చకెక్కారు ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూప మౌద్గిల్. ఏకంగా రోహిణి ప్రైవేటు ఫొటోలను షేర్ చేశారు రూప. వీటిని ముగ్గురు పురుష ఐఏఎస్ అధికారులకు రోహిణి పంపించారని ఆరోపించారు. ప్రైవేటు ఫొటోలను వారికి షేర్ చేయడం వెనక మర్మం ఏంటని ఆమెను ప్రశ్నించారు. దీంతో పాటు పలు అవినీతి ఆరోపణలు చేశారు. కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్న రోహిణి.. దాని గురించి బహిరంగంగా చెప్పుకోకుండా దాస్తున్నారని రూప ఆరోపించారు. రోహిణి అవినీతిపై విచారణ జరపాలంటూ సీఎస్‌ను కలిసి ఫిర్యాదు చేశారు రూప. రోహిణి సైతం రూపకు వ్యతిరేకంగా సీఎస్‌ను కలిశారు. తనపై రూప చేసిన ఆరోపణలను ఖండించారు.