Agnipath Appications: త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన 'అగ్నిపథ్' పథకానికి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా భారత వాయుసేనలో (Indian Air Force) నియామకాల కోసం జూన్ 24న రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకాగా.. ఆరు రోజుల వ్యవధిలోనే లక్షా 83 వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5న ముగుస్తుందని.. ఆసక్తి గల అభ్యర్థులు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
IAF Agnipath Scheme: ఇదిలా ఉంటే, త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకువచ్చేందుకుగాను 'అగ్నిపథ్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ 14న ప్రకటించింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్లు పూర్తయ్యాక వారిలో 25 శాతం మంది అగ్నివీరులను కొనసాగిస్తామని పేర్కొంది. గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో ఈ ఏడాది (2022) రిక్రూట్మెంట్లో గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచింది. దీంతో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా యువత నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. పలు రాష్ట్రాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగానూ మారాయి. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్న పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసే యోచనలోనూ ఉన్నాయి.
ఇవీ చదవండి: అపోహల అగ్నిపథం.. తొలగిస్తే విజయపథం..