Agnipath Recruitment Scheme: వాయుసేనలో అగ్నిపథ్ కింద నియామకాల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు athvayu.cdac.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని వాయుసేన అధికారులు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5వ తేదీన ముగుస్తుందని పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తు, జత చేసిన స్కాన్ కాపీలను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. అగ్నివీర్ తొలి బ్యాచును 2022 డిసెంబర్ 11 నాటికి ప్రకటించనున్నారు. మరోవైపు అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని త్రివద దళాలు తేల్చి చెబుతున్నాయి.
సాయుధ బలగాల నియామక ప్రక్రియ అగ్నిపథ్ పథకంలో ఎన్సీసీ క్యాడెట్లకు బోనస్ పాయింట్లు లభిస్తాయని ఆ సంస్థ డైరెక్టర్ లెఫ్టెనెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ అన్నారు. ఎన్సీసీలో ఏ,బీ,సీ సర్టిఫికేట్ ఉన్నవారందరికి బోనస్ పాయింట్లు లభిస్తాయని వెల్లడించారు. 'అగ్నిపథ్' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ 14న ప్రకటించింది. 17న్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్ల పూర్తయ్యాక వారి 25 శాతం మందిని మరో 15 ఏళ్లపాటు కొనసాగిస్తారని పేర్కొంది. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా యువత.. నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో 2022 రిక్రూట్మెంట్లో గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం 23 ఏళ్లకు పెంచింది. తక్కువ కాలపరిమితి(షార్ట్) సర్వీసు కమిషన్ కింద యువతకు అవకాశం ఇవ్వడం ద్వారా ప్రస్తుతం ఆర్మీ బెటాలియన్లలో సగటు వయసు 35-36 ఏళ్ల నుంచి 25-26 ఏళ్లకు తగ్గనుంది.
నాలుగేళ్ల కాలపరిమితితో తొలిసారిగా కేంద్రం తీసుకొచ్చిన 'అగ్నిపథ్' సర్వీస్ పథకం కింద తొలిబ్యాచ్‌లో 45 వేల మందిని నియమించనున్నారు. టూర్ ఆఫ్ డ్యూటీ పేరిట ప్రత్యేక ర్యాలీలు నిర్వహించి ఈ నియామకాలు చేపట్టనున్నారు. నాలుగేళ్ల పరిమితితో కూడిన ఈ సర్వీస్‌లో ఎంపికైన వారికి సాంకేతిక నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ కలిగినవారిగా తీర్చిదిద్దనున్నారు.
ఇదీ చదవండి: 'అగ్నిపథ్‌లో ఎన్సీసీ క్యాడెట్లకు బోనస్ పాయింట్లు'