కేరళ ఓనం బంపర్ లాటరీలో రూ.25 కోట్లు గెలుచుకున్న ఆటో డ్రైవర్ అనూప్.. తనకు లాటరీ రాకపోయినా బాగుండేదని ఆవేదన చెందుతున్నాడు. ఐదు రోజుల క్రితమే దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కిన అతడు.. ప్రస్తుతం తన పరిస్థితిని వివరిస్తూ ఫేస్బుక్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. లాటరీ గెలిచినప్పటి నుంచి తనకు మనశ్శాంతి లేదని చెబుతున్నాడు. తెలిసినవాళ్లు, తెలియనివాళ్లు అందరూ వచ్చి డబ్బులు సాయంగా ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నాడు.
అనూప్ తన కుటుంబంతో శ్రీకరియంలో నివసిస్తున్నాడు. తనకు కాస్త ముఖపరిచయం ఉన్నవారు కూడా డబ్బులు అడుగుతున్నారని, కాదనేసరికి శత్రువులా చూస్తున్నారని వాపోయాడు. 'నా పొరుగువారంతా నాపై కోపంగా ఉన్నారు. మాస్క్ వేసుకొని బయటకు వెళ్లినా.. చుట్టుముడుతున్నారు. నా మనశ్శాంతి మొత్తం పోయింది' అని వీడియోలో మొరపెట్టుకుంటున్నాడు.
"లాటరీ గెలవడం వల్ల ఆనందంగానే ఉంది. కానీ నేను గెలిచి ఉండాల్సింది కాదు. నేను ఎక్కడికీ వెళ్లలేకపోతున్నా. నేను ఉండే చోటును ప్రతిసారి మార్చుకుంటున్నా. ఎందుకంటే రోజూ చాలా మంది నా ఇంటికి వచ్చి సాయం కోరుతున్నారు. నాకు లాటరీ డబ్బు ఇంకా రాలేదు. ఈ విషయం ఎవరికి చెప్పినా నమ్మడం లేదు. నాకు ఇన్ని ఇబ్బందులు వస్తాయని అనుకోలేదు. ఎంత పన్ను చెల్లించాలో తెలీదు. నాకు డబ్బు అందగానే.. మొత్తం బ్యాంక్ ఖాతాలో జమా చేసేస్తా."
-అనూప్, లాటరీ విజేత
అనూప్ రూ.25 కోట్లు లాటరీలో గెలవగానే.. దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. లాటరీ టికెట్ కొనేందుకు రూ.50 తక్కువ అయినందున.. కొడుకు పిగ్గీ బ్యాంక్లో నుంచి డబ్బులు తీసుకున్నట్లు అనూప్ చెప్పుకొచ్చాడు. టికెట్ కొన్న మరుసటి రోజే లాటరీలో రూ.25 కోట్లు గెలుచుకొని సంచలనం సృష్టించాడు. కేరళ లాటరీ టికెట్ చరిత్రలో ఇదే అత్యధిక విన్నింగ్ కావడం విశేషం.