బంగాల్ ప్రచారం హోరాహోరీ దశకు చేరుకుంది. నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆ నియోజకవర్గంలో పర్యటించారు. ఇటీవల దీదీ కాలికి గాయం కాగా.. చక్రాల కుర్చీలోనే కూర్చొని ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు, పార్టీ నేతలు చేపట్టిన పాదయాత్రకు నేతృత్వం వహించారు.
నందిగ్రామ్ ప్రజలను గౌరవించే తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు దీదీ. నందిగ్రామ్‌లో జరిగిన ఉద్యమానికి సంఘీభావంగా ఈ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు.
"ఏ నియోజకవర్గం నుంచైనా నేను పోటీ చేయొచ్చు. కానీ నేను నందిగ్రామ్‌ను ఎంచుకున్నాను. ఇక్కడి అమ్మలు, సోదరీమణులను గౌరవించేందుకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాను. నందిగ్రామ్ ఉద్యమానికి సెల్యూట్ చేసేందుకు సింగూర్ బదులు ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నా. గుర్తుంచుకోండి.. నందిగ్రామ్‌లోకి ఒక్కసారి అడుగుపెడితే నేను ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లను. నందిగ్రామ్ నా ప్రాంతం. ఇక్కడే ఉంటా."
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
మమత ర్యాలీకి భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. చక్రాల కుర్చీలో ఉన్న దీదీ వెంటే నడిచారు. ర్యాలీ మొత్తం టీఎంసీ నినాదాలతో హోరెత్తిపోయింది.
ఇదీ చదవండి: 'కేరళలో ఆ రెండు కూటముల మ్యాచ్ ఫిక్సింగ్'