Hyderabad Mother and Daughter Suicide : హైదరాబాద్ రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని మణికొండలో తల్లీకుమార్తె ఆత్మహత్య కలకలం రేపింది. తల్లి అలివేలు.. తన 14 ఏళ్ల కుమార్తె లాస్యకు పడక గదిలో ఉరేసి.. ఆ తర్వాత తాను వంట గదిలోకి వెళ్లి ఉరేసుకుంది. ఈ క్రమంలో అలికిడి విన్న 9 సంవత్సరాల కుమారుడు మణికంఠ వచ్చి చూడగా అమ్మ, అక్క తాళ్లకు వేలాడుతూ కనిపించారు. వెంటనే ఇంట్లో కింద అద్దెకు ఉండే వాళ్లకు సమాచారమిచ్చాడు. వాళ్లు వచ్చి చూసే సరికి తల్లీకూతుళ్లు విగతజీవులుగా వేలాడుతున్నారు.
Manikonda Mother and Daughter Suicide case updates : వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనాస్థలానికి చేరుకొని అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని కిందకు దింపి.. క్లూస్ టీం పోలీసులు ఆధారాలు సేకరించారు. లాస్య చేతిపై గోరింటాకుతో కొన్ని రాతలు ఉన్నట్లు క్లూస్ టీం అధికారులు గుర్తించారు. "ద గేమ్ ఇజ్ స్టార్టెడ్.. డు సమ్థింగ్ దట్ మేక్స్ యూ హ్యపీ" అనే వాక్యాలు లాస్య చేతిపై రాసి ఉన్నట్లు గుర్తించారు.
- Husband Saves Wife From Harassment : 'నా భార్యకు ఆ ఫొటోలు పంపిస్తావా'.. ఆన్లైన్ కేడీ అంతుచూసిన భర్త
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్యకు ముందు తల్లీకుమార్తె ఇంట్లోని పాత వస్త్రాలను తగులబెడుతుంటే.. ఎందుకు తగులబెడుతున్నారని మణికంఠ అడిగాడు. చిన్న పిల్లాడివి ఇవన్నీ నీకెందుకని తల్లి తిట్టి.. కుమారుడిని గదిలోకి పంపించింది. చిన్నారి నిద్రలోకి జారుకున్న తర్వాత.. తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు అలివేలు.. భర్తకు రూ.5,000 ఇచ్చి యాదగిరిగుట్ట వెళ్లి రమ్మని పంపించింది. భార్య, కుమార్తె మరణవార్తను పోలీసుల ద్వారా తెలుసుకున్న సదానందం శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చేశాడు.
"కరోనా వచ్చిన నుంచి ఆ ఇంట్లో వాళ్లెవరూ బయటకు రావడం లేదు. బాబు నిద్రపోయిన తరువాత తల్లీకుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం." - మహేశ్, రాయదుర్గం సీఐ
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అలివేలుకు.. మణికొండకు చెందిన సదానందంతో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీళ్లకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. వ్యాపారంలో నష్టపోయిన తర్వాత సదానందం ఏ పనీ చేయడం లేదు. మణికొండలో నాలుగంతస్తుల ఇల్లు ఉండటంతో ఓ పోర్షన్లో వాళ్లు ఉంటున్నారు. మిగతా ఇంటిని అద్దెకు ఇచ్చారు. వాటి ద్వారా వచ్చే కిరాయితో జీవనం గడుస్తోంది. కరోనా కాలం నుంచి అలివేలు మానసిక ప్రవర్తనలో పూర్తి మార్పు వచ్చిందని చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు చెప్పారు.
అంతకంటే ముందు ఇరుగుపొరుగు వాళ్లతో కలుపుగోలుగానే ఉన్న అలివేలు.. కరోనా సమయంలో ఇంట్లో నుంచి బయటికి రాలేదని.. పరిస్థితులు చక్కబడిన తర్వాత కూడా అలాగే వ్యవహరించేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. కుమార్తె, కుమారుడిని కూడా చదువు మాన్పించి ఇంట్లోనే ఉంచుకుంది. లాస్య కరోనాకు ముందు 7వ తరగతి వరకు చదువుకుంది. మణికంఠ 2వ తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత తల్లి పాఠశాలకు పంపకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నారు.
Suicides in Telangana Today : తల్లీకూతుళ్లు ఇద్దరూ నిత్యం భక్తి పేరుతో పూజలు చేసే వారని.. అలివేలు భర్త సదానందం పోలీసులకు తెలిపారు. మూడు నెలల క్రితం తిరుపతి వెళ్తున్నట్లు చెప్పి.. నెల రోజుల పాటు తిరిగి ఇంటికి రాలేదని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని గుర్తించి ఇంటికి పంపినట్లు వెల్లడించారు. ఇంటికి తిరిగి వచ్చినా కానీ ఆ ఇరువురి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. రాయదుర్గం పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదానందం, కుమారుడు మణికంఠ వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.
ఇవీ చదవండి :