Islamic Radicals Case Update : దేశంలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన హెచ్‌యూటీ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మూడంచెల పద్ధతిలో భాగంగా తొలి దశలో యువతను ఆకర్షించి తమవైపు తిప్పుకుంటారు. రెండో దశలో వారికి సాంకేతిక, ఇతర అంశాల్లో శిక్షణ ఇచ్చి.. మూడో దశలో దాడి చేసేలా ప్రణాళికలు రచించినట్లు పోలీసులు వెల్లడించారు. వికారాబాద్ అనంతగిరి కొండల్లో తుపాకులు, గొడ్డళ్లు, కత్తులతో దాడికి శిక్షణ తీసుకున్నట్లు గుర్తించారు. మధ్యప్రదేశ్ పోలీసులు భోపాల్, హైదరాబాద్‌లో ఏకకాలంలో దాడులు చేసి 16 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో అయిదుగురు హైదరాబాద్‌కు చెందిన వారున్నారు. బుధవారం మరో వ్యక్తిని అరెస్టు చేయడంతో నిందితుల సంఖ్య 17కు చేరింది.
Hyderabad Terrorists Arrest Case Update : ఈ మొత్తం వ్యవహరాన్ని హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో హెచ్ఓడీగా పనిచేస్తున్న మహ్మద్ సలీమ్ అలియాస్ సౌరభ్‌రాజ్ పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులంతా గోల్కొండ బడాబజార్‌లో అతని నివాసంలో అనేక సార్లు సమావేశమైనట్లు వివరించారు. అరెస్టు కాక ముందు నిందితులు వివిధ ప్రాంతాల్లో కలిసిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉగ్ర కుట్ర కోణంలో నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు.
Terrorists arrested in Hyderabad : నిందితులు తమ కార్యకలాపాల్ని వేగవంతం చేసేందుకు యువతని ఆకర్షించేందుకు ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో మత మార్పిడి ఇతర అంశాలపై ప్రస్తుతం 33 వీడియోలు ఉన్నాయి. ఈ ఛానెల్‌కు 3 వేల 600మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా.. మత మార్పిడి అంశాలపై ప్రసంగిస్తున్న మహిళ నిందితుల్లో ఒకరి భార్యగా గుర్తించారు.
విశ్వనగరంలోనే ఎందుకు ఇలా : శతాబ్దాల చరిత్రగల నగరంగా ఉన్న హైదరాబాద్‌లో ఉగ్రకదలికలు ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. గతేడాది దసరా రోజు మారణహోమం సృష్టించాలనుకున్న నలుగురు లష్కరేతోయిబా ఉగ్రవాదులను ముందుగానే గుర్తించి కట్టడి చేశారు. వారి వద్ద నుంచి చైనా తయారీ గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా 'హజ్బ్ ఉత్ తహరీర్' హెచ్‌యూటీ ఉగ్రవాద సంస్థకి చెందిన అరుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. టాస్క్‌ఫోర్స్ సాయంతో నిఘా సంస్థలు ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి నిలువరించగలిగాయి. ఉగ్రమూకను గుర్తించటంలో ఏ మాత్రం జాప్యం జరిగినా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చేదని పోలీసులు అంటున్నారు.
ఇవీ చదవండి: