Hyderabad-Dubai Flight Hijack Threat : శంషాబాద్ విమానాశ్రయానికి ఓ బెదిరింపు మెయిల్ వచ్చింది. హైదరాబాద్-దుబాయ్ విమానాన్ని హైజాక్ చేయబోతున్నట్లు దుండగులు ఆ మెయిల్లో పేర్కొన్నారు. దీంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. కాసేపట్లో రన్ వే పైనుంచి బయలుదేరుతుందనగా ఆ విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికులు అందరి లగేజీని క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాత వినోద్, తిరుపతి, రాకేశ్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు దుబాయ్ మీదుగా ఇరాక్ వెళ్తున్నట్లు గుర్తించిన అధికారులు.. వారిని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు అప్పగించారు. అనంతరం హైదరాబాద్-దుబాయ్ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. అందులో ఉన్న ప్రయాణికులను మరో విమానంలో దుబాయ్ పంపించారు.
40 రోజుల వ్యవధిలో రెండో బెదిరింపు..: శంషాబాద్ విమానాశ్రయానికి ఇలాంటి బెదిరింపు మెయిల్ రావడం గత 40 రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఆగస్టు 29న సైతం ఓ ఆగంతకుడి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు మెయిల్ వచ్చింది. విమానాశ్రయంలో బాంబు ఉందంటూ ఆ మెయిల్లో పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో సీఐఎస్ఎఫ్ బృందం రంగంలోకి దిగారు. బాంబు డిస్పోజల్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ల సాయంతో ఎయిర్‌పోర్ట్ మొత్తం జల్లెడ పట్టారు. దాదాపు గంటసేపు వెతికినా బాంబు జాడ కనిపించకపోవడంతో ఫేక్ కాల్‌గా నిర్ధారణకు వచ్చారు. అనంతరం విమానాశ్రయం ఆపరేషన్స్ కంట్రోల్ కేంద్రానికి వచ్చిన మెయిల్ ఐడీ వివరాలతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
భారీ ఉగ్ర కుట్ర.. బెంగళూరులో పేలుళ్లకు ప్లాన్.. ఐదుగురు 'ముష్కరులు' అరెస్ట్
కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐ పోలీసులు.. ఆ మెయిల్‌పై ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈలోపు మరో మెయిల్ వచ్చిందంటూ ఎయిర్‌పోర్ట్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొబైల్లో ఆడుకుంటూ తన కుమారుడు తనకు తెలియకుండా ఆ మెయిల్ చేశాడని సదరు వ్యక్తి రెండో మెయిల్ పంపినట్లు పోలీసులకు తెలిపారు. తప్పు జరిగిందని.. క్షమించాలంటూ మెయిల్లో కోరాడని వివరించారు. 'అయితే సదరు వ్యక్తి తప్పు జరిగిందని చెప్పాడు కానీ.. మెయిల్ ఐడీ మాత్రం terrorist@gmail.com అని ఉంది. కుమారుడు ఫోన్‌తో ఆడుతూ తెలియకుండా పంపిస్తే ఇలాంటి ఐడీ ఎందుకు పెట్టుకున్నారనే అనుమానం వచ్చింది. అతడికి మళ్లీ మెయిల్ చేస్తే స్పందన లేకపోవడంతో అతడి ఐటీ అడ్రస్ కనిపెట్టే పనిలో పడ్డాం. వీలైనంత తొందరగా ఆ ఫేక్ మెయిల్ పంపించిందెవరో పట్టుకుంటాం. అది నిజంగా ఫేక్ మెయిలేనా.. లేక ఇందులో ఇంకా ఏదైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నాం." అని పోలీసులు తెలిపారు.
Hyderabad Airport is Most Punctual : సమయపాలనలో నంబర్ వన్ 'శంషాబాద్ ఎయిర్‌పోర్టు'
ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ బెదిరింపు రావడం.. అధికారులు.. డాగ్, బాంబు స్క్వాడ్.. పరుగులు పెడుతూ వెతకడం చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థంగాక ఆందోళన చెందారు. బాంబు పెట్టారన్న సమాచారం విని భయాందోళనకు గురయ్యారు. అయితే చివరి నిమిషంలో బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
'సీమా హైదర్ పాకిస్థాన్ ఏజెంట్?'.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడి