ప్రేమంటే ఏంటో రుజువు చేశాడు. పెళ్లంటే ఎలా తోడుండాలో.. ఎప్పటివరకు నీడై ఉండాలో చాటిచెప్పాడు. ఆయనే కర్ణాటకకు చెందిన రఘు.
రఘు, దివ్య కోలార్ జిల్లా మాలురు తాలూకా, దొడ్డకడటోరు గ్రామానికి చెందినవారు. ఇరువురు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారి అభిరుచులు, అభిప్రాయాలతో పాటు హృదయాలు ఏకమయ్యాయి. ఎప్పటికీ విడిపోవద్దనుకున్నారు. కానీ పెళ్లికి కులాలు అడ్డొచ్చాయి. అయితేనేం.. అనుకుని పెద్దలను ఎదిరించి అగ్ని సాక్షిగా పెళ్లిచేసుకున్నారు.
పెళ్లైన నాలుగేళ్లకు...
నూతన వధూవరులు చిలకాగోరింకల్లా నూతన జీవితాన్ని మొదలుపెట్టారు. నాలుగేళ్లు నాలుగు క్షణాల్లా గడిచిపోయాయి. దివ్య గర్భవతి అయింది. తమ ప్రేమకు ప్రతిరూపం కోసం వేయి కళ్లతో వేచి చూశారు. ప్రసవ గడియలు రానే వచ్చాయి. స్థానికంగా ఉన్న సెయింట్ మేరీ ఆసుపత్రిలో ఆమెను చేర్పించాడు రఘు. డాక్టర్లు మత్తుమందు ఇచ్చారు. ఆ మత్తు తర్వాత.. మళ్లీ మెలకువ రాలేదామెకు. దివ్య అచేతన స్థితిలోకి వెళ్లిందని వైద్యులు చెప్పారు.
భర్తే తండ్రై..
తన హృదయంలో నిండా కొలువై ఉన్న తన ముద్దుల భార్య మూగదైపోయింది. ఆమె ఓ సజీవ శరీరం. మాట్లాడలేదు. నడవలేదు. తను కదిపితే తప్ప కనీసం చేయి కూడా కదపలేదు. భార్యే సర్వస్వంగా బతికే రఘు ఒంటరైపోయాడు. అయితేనేం.. భార్యను వీడలేననుకున్నాడు. వీడకూడదనుకున్నాడు. ఆమెకు సేవలు చేస్తూ.. ప్రేమకు, పెళ్లికి అర్థం అంటే ఏంటో నిరూపిస్తున్నాడు.
ఇదీ చదవండి: తల్లిని చంపి.. చితిపై కోడిని కాల్చుకొని తిన్న కొడుకు