ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యంత హేయమైన ఘటన జరిగింది. కౌశంబి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్యతో విచక్షణారహితంగా ప్రవర్తించాడు. పూటుగా తాగి తన భార్య జననాంగాల్లో ఇనుపరాడ్డును చొప్పించాడు. అనంతరం ఆమెను అడవిలో వదిలేశాడు.
మహిళ కోసం కుటుంబ సభ్యులు వెతకగా.. నాలుగు రోజుల తర్వాత అడవిలో అపస్మారక స్థితిలో కనిపించింది. బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అంతా చేసి.. ఏం ఎరగనట్టు
నిందితుడిని శైలేశ్ కుమార్‌గా గుర్తించారు పోలీసులు. గత మంగవారం రాత్రి తప్పతాగి ఇంటికి వచ్చిన శైలేశ్.. తన భార్యను చిత్రహింసలు పెట్టాడు. వివస్త్రను చేసి తీవ్రంగా కొట్టాడు. రహస్య భాగాల్లో ఇనుపరాడ్డు చొప్పించాడు. తనను వదిలేయాలని బాధితురాలు ఏడుస్తూ మొరపెట్టుకున్నా వినలేదు. ఆ తర్వాత మహిళను అడవిలో వదిలేశాడు.
తర్వాత ఏం ఎరగనట్టు.. భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని మహిళ కుటుంబ సభ్యులతో బుకాయించాడు. ఆమె కోసం వెతుకుతున్నట్లు నటించాడు. నాలుగు రోజుల తర్వాత మహిళ ఆచూకీ తెలిసింది. అడవిలో ఆమెను గుర్తించిన ఓ వృద్ధురాలు బాధితురాలి తండ్రికి సమాచారం అందించింది. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లి స్పృహ కోల్పోయిన తన కూతురిని ఆస్పత్రికి తరలించాడు తండ్రి. అనంతరం కౌశంబి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
మహిళకు తీవ్ర గాయాలయ్యాయని, అయితే ప్రాణాపాయం లేదని జిల్లా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలికి, ఆమె భర్తకు మధ్య వివాదాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'గత ప్రభుత్వాల వల్లే అసోం వెనుకబడింది'