Human Elephant Conflict In Assam : ఇక్కడ కనిపిస్తున్న వీరంతా "హథీ బంధు" స్వచ్ఛంద సంస్థ సభ్యులు. ఈ బృందానికి వినోద్ దులు బోరా నాయకత్వం వహిస్తున్నారు. అసోంలోని అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఏనుగులు, మనుషుల మధ్య ఘర్షణలు ఎక్కువగా జరగడాన్ని ఈ స్వచ్ఛంద సంస్థ గమనించింది. వివిధ అధ్యయనాలు చేసి సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొంది. ఏనుగులు జనావాసాలకు ఎక్కువగా రావడానికి వివిధ కారణాలు ఉన్నప్పటికీ.. ఆహారమే ప్రధాన కారణమని వారు గుర్తించారు. దీనిపై అధ్యయనం చేసిన ఈ బృందం గజరాజులకు ఇష్టమైన ఆహారమైన నేపియర్ గడ్డిని కొండ ప్రాంతాల్లో పెంచడం మొదలు పెట్టింది. ఇది మంచి ఫలితాలు ఇవ్వడం వల్ల సమస్య ఎక్కువగా ఉన్న నాగావ్‌లో 250 ఎకరాల్లో నేపియర్ గడ్డిని సాగు చేసింది. వీటి ఖర్చు మొత్తం ఈ స్వచ్ఛంద సంస్థే భరిస్తోంది.
తమకు ఇష్టమైన ఆహారం అడవికి దగ్గరలోనే దొరుకుతుండడం వల్ల గజరాజులు జనావాసాల వద్దకు వెళ్లడం తగ్గించాయి. దీంతో ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణలు చాలా వరకు తగ్గాయి. ఏనుగుల కదలికలను "హాథీ బంథు" బృందం ఎప్పటికప్పుడు డ్రోన్లతో గమనిస్తోంది. అవి నేపియర్ గడ్డి తింటున్న సమయంలో రైతులు తమ పంట పొలాలకు వెళ్లి పనులు చేసుకోమని సూచనలు చేస్తోంది.
పంట చేతికొచ్చే సమయంలో, వరదలు సంభవించినప్పుడు ఏనుగులు జనావాసాల వద్దకు ఎక్కువగా వస్తుంటాయని "హాథీ బంధు" బృందం తెలిపింది. గజరాజుల గుంపు పంటలను తీవ్రంగా దెబ్బతీస్తాయని.. ఇళ్లను ధ్వంసం చేస్తాయని చెప్పింది. అడ్డు వచ్చిన వారి ప్రాణాలను తీసిన ఘటనలు ఉన్నాయని తెలిపింది. ఆ సమయంలో ఏనుగు గుంపులను అదుపు చేయడం అటవీశాఖ సిబ్బందికి కూడా కత్తిమీద సాములా ఉంటుందని "హాథీ బంధు" పేర్కొంది.
కొన్ని రోజులుగా "హాథీ బంధు" స్వచ్ఛంద సంస్థ చేస్తున్న వినూత్న ప్రయత్నంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అసోంలో ఈ సంస్థ కారణంగా ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణలు చాలా వరకు తగ్గాయి. దీంతో అడవి సమీపంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.