IT officials Inspections in shops 300 kg gold seized: బంగారం వ్యాపారంలో దేశంలోనే రెండో ముంబయ్గా ప్రసిద్ది చెందిన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో బంగారం దుకాణాలపై కేంద్ర ఆదాయ పన్ను శాఖ (Central Income Tax Department) అధికారులు దాడులకు దిగారు. కొన్ని రోజులుగా స్థానికంగా బంగారం దుకాణాల్లో తనిఖీలు చేస్తోన్న అధికారులు.. ఇవాళ భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దసరా పండుగ సమయంలో అధికారులు చేపట్టిన ఈ తనిఖీలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో మిగిలిన బంగారం వ్యాపారుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన మొదలైంది. ఐటీ అధికారుల తనిఖీలు తమ వరకూ వస్తాయన్న ఆందోళనతో బంగారం వ్యాపారులతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న స్వర్ణకారులకు చెందిన వేలాది దుకాణాలను మూసివేశారు. నిత్యం బంగారం కొనుగోళ్లతో కళకళలాడే దుకాణాలన్నీ ఒక్కసారిగా మూసివేయడం అనేక రకాల విమర్శలకు దారి తీస్తోంది. దీంతో బంగారం కొనుగోళ్లకు వచ్చిన ప్రజలు వెనుదిరిగి వెళ్తున్నారు.
ప్రొద్దుటూరులో పలు బంగారం దుకాణాల్లో ఐటీ అధికారుల చేపట్టిన తనిఖీలు ముగిశాయి. నాలుగు బంగారం దుకాణాల్లో బిల్లులు లేని 300 కిలోల బంగారాన్ని సీజ్ (300 kg gold seized in Proddutur) చేశారు. విజయవాడ, తిరుపతికి చెందిన ఐటీ అధికారులు గత నాలుగు రోజులుగా ప్రొద్దుటూరులోని బుశెట్టి జువెలర్స్, డైమండ్స్ దుకాణాలతో పాటు గురురాఘవేంద్ర, తల్లం దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేపట్టగా భారీ ఎత్తున లెక్కల్లో లేని బంగారం బయటపడింది. దీంతో అధికారులు ఆ బంగారాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన బంగారంను అట్టపెట్టెలు, సూట్‌కేసుల్లో భద్రపరిచి తిరుపతికి తీసుకెళ్లారు. పొరుగు ప్రాంతాల నుంచి బిల్లులు లేకుండా బంగారం దిగుమతి చేసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు.
బంగారం వ్యాపారంలో ప్రొద్దుటూరు రెండో ముంబయిగా ఖ్యాతి గడించింది. దీంతో భారీగా అక్రమ బంగారం దిగుమతి అవుతోందన్న పక్కా సమాచారంతో అధికారుల నాలుగు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ముందుగా అధికారులు బుశెట్టి జువెలర్స్, డైమండ్స్ దుకాణాలలో పాటు తల్లం, గురురాఘవేంద్ర జువెలర్స్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు. భారీగా బంగారాన్ని కనుగొన్నారు. ఈ భారీ అక్రమ బంగారం నిల్వలతో పాటు డబ్బును అధికారులు గుర్తించినట్లు సమాచారం.
ఆ బంగారం అంతా పొరుగు ప్రాంతాల నుంచి బిల్లులు లేకుండా బంగారం దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రొద్దుటూరులో రెండు వేలకు పైగా బంగారం, స్వర్ణ కారుల దుకాణాలు ఉన్నాయి. ఐటి అధికారుల తనిఖీలతో మిగతా బంగారం వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. తనిఖీలు తమ దుకాణాలకు వస్తాయన్న ఆందోళనతో బంగారం, స్వర్ణ కారుల దుకాణాలు వ్యాపారులు మూసివేశారు. దసరా పండుగ సమయంలో బంగారం దుకాణాలన్నీ మూత పడటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.