e-Shram Card Benefits in Telugu : దేశంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో కొన్నింటికి మాత్రమే ఆదరణ లభిస్తోంది. ఇకపోతే కొన్ని సంక్షేమ పథకాల గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో వాటి ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. అటువంటి వాటిలో 'ఇ-శ్రమ్ కార్డు'(e-Shram Card) ఒకటిగా చెప్పుకోవచ్చు. దీనినే శ్రామిక్ కార్డుగా పిలుస్తారు. ఈ కార్డు పొందడం ద్వారా ఉచితంగా రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా పొందడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇంతకీ ఇ-శ్రమ్ కార్డు అంటే ఏమిటి? దీనికి ఎవరెవరు అర్హులు? ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు? ఎలా అప్లై చేసుకోవాలి? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఇ-శ్రమ్ కార్డ్ అంటే ఏమిటనగా.. ఇది అసంఘటిత రంగంలోని కార్మికులకు ప్రభుత్వం జారీ చేస్తున్న ప్రత్యేక కార్డు. దేశంలో ఎక్కువ మంది భవన నిర్మాణం వంటి అసంఘటిత రంగాల్లో పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. అయితే వీరికి ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఉండవు. ఏళ్ల తరబడి అదే పని చేస్తున్నా గ్రాట్యుటీ అంటేనే వీళ్లకు తెలియదు. అటువంటి శ్రమ జీవుల భవిష్యత్తు భద్రత కోసం, వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇ-శ్రమ్ కార్డు పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తుంది.
వీరికి సంఘటిత రంగ కార్మికులతో సమానంగా ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్రం శ్రామిక్ కార్డు పేరిట 2021, ఆగస్టులో ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా.. దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ బెనిఫిట్స్ వారికి అందజేయడమే ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకోసం కూలీలకు ఇ-శ్రమ్ కార్డులు ఇస్తున్నారు.
ఇ-శ్రమ్ కార్డ్ ప్రయోజనాలు :
- ఈ కార్డు తీసుకున్న కార్మికులు దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై పాక్షిక వికలాంగులుగా మారితే కేంద్ర ప్రభుత్వం రూ.1 లక్ష చెల్లిస్తుంది.
- అదే శాశ్వత వైకల్యం లేదా మరణం సంభవించినప్పుడు రూ. 2 లక్షలు బీమా కవరేజీ బాధిత కుటుంబానికి లభిస్తుంది.
- ఇ-శ్రమ్ కార్డు ద్వారా కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే కాకుండా వారి పిల్లలకు ఉచిత సైకిళ్లు, పని ముట్లు, కుట్టు మిషన్లు వంటి ఇతర ఆర్థిక సహాయాలు అందుకునే అవకాశం ఉంది.
Pradhan Mantri Vaya Vandana Yojana: వృద్ధాప్యంలో ఆదాయం కోసం.. కేంద్రం పాలసీ.. మీకు తెలుసా?
వీరంతా అప్లై చేసుకోవచ్చు : పరిశ్రమల్లో పని చేసే కార్మికులు, రోజు వారీ కూలీలు, వీధి వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, తక్కువ వేతనాలు అనగా రూ.15 వేల లోపు ఉన్న ఉద్యోగులు, పీఎఫ్, ఈఎస్‌ఐ, ఆదాయపు పన్ను చెల్లించని వారు, రేషన్‌కార్డు దారులు ఇలా 16 నుంచి 59 ఏళ్ల లోపు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు 28 కోట్ల ఇ-శ్రమ్ కార్డులు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన ఇతర పథకాల ప్రయోజనాలను వీరు పొందేందుకు వీలుగా రేషన్ కార్డుతో ఇ-శ్రమ్ కార్డును అనుసంధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలంటే..
- ఇ-శ్రమ్ కార్డు పొందేందుకు ఆన్‌లైన్ ద్వారా Eshram.gov.inలో అప్లై చేసుకోవాలి.
- ముందుగా ఆధార్ కార్డుతో లింకైన మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- అనంతరం అడ్రస్, విద్యార్హతలు వంటి వివరాలు నమోదు చేయాలి.
- అలాగే ఏ పనిలో నైపుణ్యం ఉంది, పని స్వభావంతో పాటు బ్యాంకు అకౌంట్ వివరాలు ఎంటర్ చేయాలి.
- ఇక చివరగా ధ్రువీకరణ కోసం మొబైల్‌కు వచ్చిన ఓటీపీ నమోదు చేయడం ద్వారా ఈజీగా ఈ కార్డుకు అప్లై చేసుకోవచ్చు.