కేరళ ఎర్నాకుళంలో గతవారం ఓ అపార్ట్మెంట్ నుంచి కిందకు దిగుతూ జారిపడిన పనిమనిషి.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తమిళనాడులోని సేలంకు చెందిన కుమారి(55).. డిసెంబర్ 5న భవంతిలోని ఆరో అంతస్తు బాల్కనీ ద్వారా దిగడానికి ప్రయత్నించి జారిపడింది. దీంతో తలకు తీవ్రగాయమైన ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు చేతులెత్తేయడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది.
కుమారిని ఫ్లాట్ యజమాని నిర్బంధించడం వల్లే ఇలా జరిగిందని.. అతనే ఈ మరణానికి కారణమని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యజమాని అక్రమంగా నిర్బంధించారని బాధితురాలి భర్త, కుమారుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
'బాధితురాలికి తన భర్త నుంచి ఫోన్‌కాల్ వచ్చిన నేపథ్యంలో ఇంటికి వెళ్లాలని అభ్యర్థించగా.. అనుమతివ్వలేదు. అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. ఆ మహిళ రెండు చీరలను కట్టి, అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి దిగడానికి ప్రయత్నించింది' అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు కొచ్చి నగర పోలీసు కమిషనర్ విజయ్ శంకర్.
ఇదీ చూడండి: యూపీలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం- ఇద్దరి అరెస్ట్