బంగాల్ తూర్పు మిద్నాపుర్లోని పాంస్కుడా ప్రాంతంలో అమానవీయ ఘటన జరిగింది. ఓ 10 నెలల పసికందును పనిమనిషి చిత్రహింసలకు గురిచేసింది. కొడుతూ, కిందకు విసిరేస్తూ కనికరం లేకుండా వ్యవహరించింది.
వివరాల్లోకి వెళ్తే.. పాంస్కుడాకు చెందిన డా. దేబాశిష్ బాంకురాలోని ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆమె భార్య నాబమిత భట్టాచార్య కూడా జిల్లా ప్రజారోగ్య శాఖ ఉన్నతోద్యోగి. విధుల్లో తీరిక లేకుండా ఉంటున్న కారణంగా.. వారి 10 నెలల కూతురును చూసుకునేందుకు కల్పనాసేన్ అనే 50 ఏళ్ల మహిళను పనిమనిషిగా నియమించుకున్నారు.
ఆ మహిళ.. తమ పాపను సరిగా చూస్తుందో లేదో అనే అనుమానంతో ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విధుల్లో ఉన్న సమయంలోనే.. ఓసారి తన ఫోన్లో ఫుటేజీని పరిశీలించారు దేబాశిష్. చిన్నారిని పనిమనిషి కొడుతున్న దృశ్యాలు కంటపడ్డాయి. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు.. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. పనిమనిషి తన నేరం అంగీకరించింది.
ఇదీ చూడండి: ముఖంపై 8 కేజీల కణతి.. 16 సర్జరీలు చేసి చివరకు...