పెళ్లికి గిఫ్ట్‌గా వచ్చిన హోం థియేటర్ పేలి.. నవ వరుడు, ఓ బంధువు మృతి చెందిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివాహం జరిగిన మూడో రోజునే వరుడు చనిపోవడం పట్ల ఇరువురి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. కబీర్దామ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెంగాఖర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చమరి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని హేమేంద్ర మేరవిగా పోలీసులు గుర్తించారు. హేమేంద్రకు రెండు రోజుల క్రితమే పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో అతడికి ఓ హోం థియేటర్ బహుమతిగా వచ్చింది. ఆదివారం దాన్ని బయటకు తీసి కరెంట్ ప్లగ్‌కు కనెక్షన్ ఇచ్చాడు హేమేంద్ర. వెంటనే హోం థియేటర్ పేలిపోయింది. పేలుడు ధాటికి హేమేంద్ర తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. హేమేంద్ర బంధువు కూడా ప్రమాదంలో చనిపోయాడు.
ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నారు. "పోలీసులు వెళ్లేసరికి హేమేంద్ర చనిపోయాడు. మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. వారందరిని స్థానిక ఆసుపత్రికి తరలించాం. మృతదేహాలను శవ పరీక్షల కోసం పంపించాం. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నాం" అని జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనీషా ఠాకూర్ తెలిపారు.
ప్రయోగశాలలో పేలుడు..
ఇటీవలే.. దిల్లీలోని ఓ స్కూల్ ప్రయోగశాలలో పేలుడు సంభవించింది. ఘటనలో ఇద్దరు విద్యార్థులు, టీచర్ గాయపడ్డారు. టీచర్ ప్రయోగం గురించి విద్యార్థులకు వివరిస్తుండగా ఘటన జరిగింది. టీచర్ తీవ్ర గాయాలు కావటం వల్ల.. ఆమెను దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు కాలేజీ యాజమాన్యం. విద్యార్థులకు స్కూల్లోని ప్రథమ చికిత్స చేసి ఇంటికి పంపించారు.
ఏసీ పేలి మహిళ, ఇద్దరు చిన్నారులు మృతి..
కొద్ది రోజుల క్రితం ఇంట్లో ఏసీ పేలి ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కర్ణాటకలోని రాయచూర్‌లో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో మృతులంతా సజీవదహనమయ్యారు. శక్తినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఏసీ ఒక్కసారిగా పేలి.. అనంతరం గది మొత్తం భారీగా మంటలు వ్యాపించాయి. ఘటన సమయంలో గదిలో ఉన్న రంజిత (33), ఆమె ఇద్దరు సంతానం మృదల (13), తరుణ్య (5).. మంటల ధాటికి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. మృతురాలు రంజిత, ఆమె భర్త సిద్ధలింగయ్య మండ్య జిల్లాకు చెందినవారు.
ఇవీ చదవండి:
పక్కా ప్లాన్‌తోనే ట్రైన్లో ప్రయాణికుడికి నిప్పు! ఉగ్రవాది పనేనా? అతడి కోసం పోలీసుల వేట
కోడలి రాజకీయంతో దేవెగౌడకు తలనొప్పి.. రెబల్‌గా పోటీకి సై!.. కుమారస్వామి తగ్గేదేలే!