బంగ్లాదేశ్ విముక్తితో పాటు.. భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు నిండిన సందర్భంగా ఇరుదేశాల హోం శాఖ కార్యదర్శుల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. శనివారం ఆన్లైన్లో జరిగిన ఈ కార్యక్రమంలో భారత్ తరపున కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా హాజరు కాగా.. బంగ్లాదేశ్ ప్రతినిధి బృందానికి సీనియర్ సెక్రటరీ మొస్తఫా కమల్ ఉద్దీన్ నాయకత్వం వహించారు.
'ముజీబ్‌బర్షో' పేరిట 19వ సారి నిర్వహించిన ఈ చర్చలకు ఒక ప్రత్యేకత ఉంది. బంగ్లాదేశ్ విముక్తి జరిగి 50సంవత్సరాలు పూర్తవ్వడం సహా.. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు 50ఏళ్లు నిండాయని అధికారులు తెలిపారు.
భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులో నిర్మిస్తున్న కంచె(ఫెన్సింగ్) పనులను అనుకున్న సమయానికంటే ముందే పూర్తి చేయడంపై ఇరు దేశాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాద సమస్య పరిష్కారానికి నిబద్ధతతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లను నియంత్రించేందుకు సమగ్ర సమకాలిత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ(సీఐబీఎంఎస్) సమర్థంగా పనిచేస్తోందని ఇరుదేశాలు ప్రశంసించాయి.
భారత్-బంగ్లాలు ద్వైపాక్షిక సంబంధాలకు అధిక ప్రాముఖ్యతను ఇస్తున్నాయని ఇరువురు కార్యదర్శులు ఉద్ఘాటించారు. భద్రత, సరిహద్దు సమస్యలలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. నకిలీ భారతీయ కరెన్సీ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మరింత సహకరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.
తమ దేశానికి చెందిన వివిధ భద్రతా సంస్థల శిక్షణలో భారత సహకారానికి బంగ్లాదేశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
విలువైన బహుమతులు..
1971యుద్ధంలో పాకిస్థాన్‌పై విజయం సాధించి 50సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బంగ్లాదేశ్ వైమానిక దళానికి 'లెగసీ అలొయెట్-III' అనే హెలికాప్టర్‌ను భారత్ బహూకరించింది. ఈ మేరకు భారత వైమానిక దళ అధిపతి ఆర్.కే.ఎస్ భదౌరియా బంగ్లాకు హెలికాఫ్టర్‌ను అందించారు. అలాగే బంగ్లాదేశ్ సైతం 'ఎఫ్-86 సాబ్రే' అనే యుద్ధ విమానాన్ని భారత్‌కు బహుమతిగా అందించింది.
నాలుగు రోజుల బంగ్లాదేశ్ పర్యటన నిమిత్తం ఢాకాకు చేరుకున్న భదౌరియా.. అక్కడి ఎయిర్‌బేస్‌లను సందర్శించారు. అనంతరం.. బంగ్లా సైనికాధికారులతో భేటీ అయ్యారు.
ఇదీ చదవండి: విజయ్ దివస్: భారత శక్తి.. బంగ్లాదేశ్ విముక్తి!